కొలంబో : శ్రీలంక గడ్డపై భారత్ జోరు కొనసాగుతోంది. రెండో టెస్టులో విజయం దిశగా దూసుకెళ్తోంది. బంతితో మెప్పించలేకపోయిన ఆతిథ్య జట్టు బ్యాట్‌తో ప్రతిఘటించినా.. ఫాలోఆన్ ప్రమాదం ముంగిట నిలిచింది. స్పిన్నర్ మానవ్ సుతార్ (3/83), పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ (3/47) రాణించడంతో ఓవర్‌నైట్ స్కోరు 8/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంక మూడో రోజు, మంగళవారం వర్షంతో ఆట ముగిసిన సమయానికి 83.4 ఓవర్లలో 265/8తో ఎదురీదుతోంది. పసిందు సూర్యబండార (133 బంతుల్లో 9 ఫోర్లతో 80), సోనల్ దినుషా (137 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 బ్యాటింగ్) రాణించడంతో లంక పోరాడగలిగింది.
ఓ దశలో 173/7తో 200 స్కోరులోపే ఆలౌటయ్యేలా కనిపించిన లంకను దినుషా ఆదుకున్నాడు. చివరి వరుస బ్యాటర్లతో కలిసి భారత బౌలర్లను విసిగించాడు. ప్రస్తుతం అతనితో పాటు లాహిరు కుమార (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో రెండు వికెట్లే ఉండగా.. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు లంక ఇంకా 238 రన్స్ దూరంలో ఉంది. ఫాలోఆన్ తప్పించుకోవాలన్నా.. మరో 38 పరుగులు చేయాలి. ఇప్పటికైతే మ్యాచ్ గిల్‌సేన చేతుల్లోకి వచ్చినట్టే. నాలుగో రోజు మిగిలిన రెండు వికెట్లను తొందరగా పడగొట్టి లంకను ఫాలోఆన్‌లోకి నెడితే మరోసారి బ్యాటింగ్‌కు రాకుండా మ్యాచ్ ముగించే చాన్సుంది.
మూడో రోజు తొలి సెషన్లో రెండు వికెట్లు కోల్పోయినా 122 పరుగులు రాబట్టిన లంక పైచేయి సాధించింది. ఆట మొదలైన వెంటనే భారత్ తొలి బ్రేక్ సాధించింది. పేసర్ ప్రసిద్ధ్ వేసిన రైజింగ్ బాల్‌ను వెంటాడిన ఓవర్‌నైట్ బ్యాటర్ కమిల్ మిషార (19) కీపర్ జురెల్‌కు క్యాచ్ ఇవ్వడంతో లంక 35/3తో నిలిచింది. కానీ, పసిందు సూర్యబండార, కమిందు మెండిస్ (32) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. దాదాపు రెండు గంటల పాటు పోరాడారు. పేసర్ల బౌలింగ్‌లో కాస్త ఇబ్బంది పడినా.. స్పిన్నర్లు సుతార్, సారాంశ్పై పైచేయి సాధించారు. అరంగేట్రం స్పిన్నర్ సారాంశ్ పిచ్ నుంచి కొంత బౌన్స్, టర్న్ రాబట్టినా.. లంక బ్యాటర్లు దీటుగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తన కెరీర్లో రెండు టెస్టు ఆడుతున్న పసిందు మంచి షాట్లతో అలరిస్తూ 76 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సుతార్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన మెండిస్ దూకుడు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, తన రెండో స్పెల్‌లోనూ మెరుగ్గా బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్.. లంచ్‌కు ముందు పదునైన షార్ట్ బాల్‌తో మెండిస్ పని పట్టి నాలుగో వికెట్‌కు కీలకమైన 87 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు.

130/4తో లంక లంచ్‌కు వెళ్లిన తర్వాత వర్షంతో కాసేపు ఆట ఆగినా.. తిరిగి ప్రారంభమైన తర్వాత భారత బౌలర్ల జోరు మొదలైంది. రెండో సెషన్లో 86 రన్స్ మాత్రమే ఇచ్చిన పర్యాటక జట్టు నాలుగు వికెట్లు పడగొట్టింది. తన లెంగ్త్‌కు సరి చేసుకున్న సుతార్.. కెప్టెన్ ధనంజయ డిసిల్వా (8) బ్యాట్ నుంచి ఎడ్జ్ రాబట్టగా.. స్లిప్‌లో రెండో ప్రయత్నంలో రాహుల్ దాన్ని అందుకున్నాడు. ఈ దశలో ఇన్ఫామ్ బ్యాటర్ దినుషాతో ఆరో వికెట్‌కు 34 రన్స్ జోడించిన పసిందు శతకం చేసేలా కనిపించాడు. కానీ, సీనియర్ స్పిన్నర్ జడేజా అతడిని బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టుకు షాకిచ్చాడు. ఆ వెంటనే కీపర్ డిక్వెలా (0)ను స్లో షార్ట్‌బాల్‌తో బోల్తా కొట్టించడంతో 173/7తో కష్టాల్లో పడ్డ లంక ఇన్నింగ్స్ రెండో సెషన్లోనే ముగిసేలా కనిపించింది.
కానీ, టెయిలండర్లను త్వరగా ఔట్ చేయలేని పాత బలహీనతను భారత్ మరోసారి బయటపెట్టింది. క్రీజులో కుదురుకున్న దినుషా చివరి వరుస బ్యాటర్లతో అద్భుతంగా పోరాడాడు. 216/7తో జట్టును టీ బ్రేక్‌కు తీసుకెళ్లిన అతను మూడో సెషన్లో ఓపిగ్గా క్రీజులో పాతుకుపోడంతో పాటు మంచి టెక్నిక్‌తో పర్యాటక బౌలర్లను ఎదుర్కొన్నాడు. ప్రసిద్ధ్ యార్కర్లతో సవాల్ విరిసినా.. స్పిన్ త్రయం కట్ట్టుదిట్టమైన బంతులతో ఇబ్బంది పెట్టినా ఏకాగ్రత కోల్పోకుండా శాంతంగా బ్యాటింగ్ చేశాడు. దాదాపు 201 నిమిషాల పాటు బౌలర్లను విసిగించాడు. 84 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న అతనికి నువంతా (74 బంతుల్లో 18), లాహిరు గొప్ప డిఫెన్స్‌తో సహకారం అందించాడు. ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు జోడించిన నువంతాను సుతార్ పెవిలియన్ చేర్చినా.. చివరి గంట లాహిరుతో కలిసి అజేయంగా 35 పరుగులు జోడించిన దినుషా మరో వికెట్ పడకుండా రోజు ముగించాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 503/9 డిక్లేర్డ్; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 83.4 ఓవర్లలో 265/8 (దినుషా 85 బ్యాటింగ్, పసిందు 80, ప్రసిద్ధ్ 3/47, సుతార్ 3/83)