టాంటన్: టీ20 ప్రపంచకప్ టోర్నీ చివరి సన్నాహక సిరీస్‌లో భారత మహిళల జట్టు నిరాశపరిచింది. ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (40 బంతుల్లో 7 ఫోర్లతో 56 నాటౌట్) మెరిసినా బౌలర్లు ఫెయిలవడంతో మంగళవారం అర్ధరాత్రి జరిగిన మూడో, చివరి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ టీమ్ చేతిలో ఓడిపోయింది. తొలుత భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 180/5 భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు మంధాన (8), షెఫాలీ (11) విఫలమైనా.. కెప్టెన్ హర్మన్ అర్ధ శతకంతో సత్తా చాటింది. యాస్తికా భాటియా (32), దీప్తి శర్మ (32) కూడా రాణించారు. ఆతిథ్య బౌలర్లలో లారెన్ బెల్ (2/36) రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం ఛేదనలో అలీస్ క్యాప్సీ (43 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 82), హెదర్ నైట్ (42 బంతుల్లో 10 ఫోర్లతో 70 నాటౌట్) విజృంభించడంతో ఇంగ్లిష్ టీమ్ 18.3 ఓవర్లలోనే 184/4 స్కోరు చేసి సులువుగా గెలిచింది. అరుంధతి రెడ్డి (2/31), క్రాంతి గౌడ్ (2/41) రెండేసి వికెట్లు తీసినా ఫలితం తేకపోయింది. క్యాప్సీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి. ఈ నెల 12 నుంచి ఇంగ్లండ్‌లోనే జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత్ పోటీ పడనుంది.