నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : జస్ప్రీత్ బుమ్రా..భారత బౌలింగ్‌కు ఆయువుపట్టు. స్వదేశం, విదేశమన్న తేడా లేకుండా వికెట్ల వేట కొనసాగిస్తున్న మేరు నగధీరుడు. అసహజమైన బౌలింగ్ యాక్షన్‌తో ప్రత్యర్థి బ్యాటర్ల పాలిట సింహస్వప్నంలా నిలుస్తూ చిరస్మరణీయ విజయాలందిస్తున్నాడు. మెరుపు వేగానికి స్వింగ్ జోడిస్తూ బుమ్రా కొనసాగించే వికెట్ల విధ్వంసం మాటలకందనిది. ఎంత తోపు బ్యాటర్ అయినా.. బుమ్రా బౌలింగ్‌కు దిగాడంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా టీమ్ఇండియాకు ఆపద్బాంధవునిలా మారిన బుమ్రా టెస్టుల్లో తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్నాడు. ఇటీవలి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల్లో ఏకంగా 32 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. బౌలింగ్ భారాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ ముందుకు సాగుతున్నాడు.
తాజాగా ముగిసిన లీడ్స్ టెస్టులోనూ ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టిన ఈ స్పీడ్‌స్టర్‌కు సహచర బౌలర్ల సహకారం కరువైంది. 44 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 5 వికెట్లు తీస్తే..సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ కలిసి 92 ఓవర్లు వేసి 9 వికెట్లకే పరిమితమై ఘోరంగా నిరాశపరిచారు. గత కొన్నేండ్ల నుంచి పేస్ బౌలింగ్‌కు అన్నీతానై వ్యవహరిస్తున్న బుమ్రా..ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదన్న వార్త అభిమానులను నిరాశకు గురి చేస్తున్నది.
స్వింగ్‌కు సహకరించే ఇంగ్లండ్ పిచ్‌లపై బుమ్రా లేని లోటు పూడ్చలేనిది. సిరీస్‌కు ముందే చీఫ్ కోచ్ గౌతం గంభీర్ చెప్పినట్లు ఐదు టెస్టుల్లో బుమ్రా మూడింటికి మాత్రమే అందుబాటులో ఉంటాడా అన్న మాటను నిజం చేస్తూ రెండో టెస్టుకు అతనికి విశ్రాంతినిచ్చారు! ఇప్పటికే గెలువాల్సిన మొదటి టెస్టును ఇంగ్లండ్‌కు అప్పగించిన గిల్‌సేన… బుమ్రా లేకుండా రెండో టెస్టులో ఎలా రాణిస్తుందన్నది ఆసక్తికరం. ప్రస్తుత జట్టులో సిరాజ్ మినహాయిస్తే అంతగా అనుభవమున్న బౌలర్ లేకపోవడం భారత్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నది. మాజీ చీఫ్‌కోచ్ రవిశాస్త్రి ఇప్పటికే చెప్పినట్లు బుమ్రాను గనుక రెండో టెస్టులో ఆడించకపోతే సిరీస్‌లో టీమ్ఇండియా 0-2తో వెనుకబడటం ఖాయంగా కనిపిస్తున్నది. మరి ఈ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తున్నదో చూడాలి.
సరిగ్గా మూడేండ్ల క్రితం ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన టీమ్ఇండియా బౌలింగ్ బలగాన్ని ప్రస్తుత కాంబినేషన్‌ను పరిశీలిస్తే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటి జట్టులో ఇషాంత్‌శర్మ, బుమ్రా, షమీ, సిరాజ్ పేస్ బౌలింగ్‌ను ముందుండి నడిపించారు. ఒకరిని మించి మరొకరు రాణించడంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమ్ఇండియా 2-2తో డ్రా చేసుకుంది. కానీ ఇప్పటి జట్టులో బుమ్రా, సిరాజ్ మినహాయిస్తే ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం లేని బౌలర్లు ఉన్నారు. ప్రసిద్ధ్, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ ప్రతిభ కల్గిన బౌలర్లే అయినా ఇంగ్లండ్ పరిస్థితులపై అంతగా అనుభవం లేకపోవడం టీమ్ఇండియాకు ప్రతిబంధకంగా మారింది. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టును పరిశీలిస్తే బుమ్రా 44 ఓవర్లలో 5 వికెట్లు తీస్తే..ప్రసిద్ధ్, సిరాజ్ అంతగా ఆకట్టుకోలేకపోయారు.
ముఖ్యంగా గత సిరీస్‌లో దుమ్మురేపిన హైదరాబాదీ సిరాజ్ ఈసారి సత్తాచాటలేకపోతున్నాడు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తే సత్తా ఉన్న సిరాజ్ విఫలమవుతుండటం టీమ్ఇండియాను కలవరపెడుతున్నది. బర్మింగ్‌హామ్ టెస్టుకు బుమ్రా గైర్హాజరీ అయితే టీమ్ఇండియాకు సిరాజ్ నాయకత్వం వహించాల్సి ఉంటుంది. బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్‌సింగ్ అరంగేట్రం దాదాపు ఖరారు కాగా, శార్దుల్‌కు బదులు నితీశ్‌కుమార్‌రెడ్డి లేదా కుల్దీప్యాదవ్ తుది జట్టులోకి రానున్నారు. ఇదిలా ఉంటే బుమ్రాకు తోడుగా మిగతా బౌలర్లు సత్తాచాటితే ఇంగ్లండ్ సిరీస్‌లో టీమ్ఇండియాకు తిరుగుండదు. లీడ్స్ టెస్టులో ఒక బుమ్రా బౌలింగ్‌లోనే నాలుగు క్యాచ్‌లు నేలపాలయ్యాయి అంటే అతని కచ్చితత్వం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బుమ్రా ఉంటే ఎలా ఉం టుందో.. లేకపోతే అంతకన్నా బలహీనంగా ఉంటుందన్న పరిస్థితి తారుమారు చేయాల్సిన అవసరం మిగతా బౌలర్లపై ఎంతైనా ఉన్నది.
2024 నుంచి భారత తరఫున టెస్టుల్లో బుమ్రా 15.07 సగటుతో 78 వికెట్లు తీశాడు. అదే సమయంలో మిగతా బౌలర్లంతా కలిసి 33.48 సగటుతో 80 వికెట్లకే పరిమితమయ్యారు. ఇందులో బుమ్రా ఆరుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన కనబర్చడం విశేషం.
ఇంగ్లండ్‌లో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో ఇషాంత్(51) టాప్‌లో ఉండగా, కపిల్‌దేవ్ (43), బుమ్రా (42) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.