రాజ్‌కోట్ : సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు ఓటమిపాలైంది. రాజ్‌కోట్ ఆతిథ్యమిచ్చిన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా నిర్దేశించిన 285 పరుగుల లక్ష్యాన్ని 47.3 ఓవర్లలోనే బాదేసిన కివీస్ రికార్డు విజయాన్ని నమోదుచేసింది. ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ (117 బంతుల్లో 131 నాటౌట్, 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకానికి తోడు విల్ యంగ్ (98 బంతుల్లో 87, 7 ఫోర్లు) రాణించడంతో ఆ జట్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలుతు బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు సాధించింది. టాపార్డర్ విఫలమైనా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (92 బంతుల్లో 112 నాటౌట్, 11 ఫోర్లు, 1 సిక్స్) శతక్కొట్టగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (53 బంతుల్లో 56, 9 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో ఆదుకున్నారు. క్రిస్టియన్ క్లార్క్ (3/56) బంతితో భారత్‌ను కట్టడిచేశాడు. మిచెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇరుజట్ల మధ్య సిరీస్ విజేతను తేల్చే మూడో వన్డే ఈ నెల 18న ఇండోర్‌లో జరుగుతుంది.
లక్ష్యం పెద్దదేమీ కాకపోయినా 46 రన్స్‌కే కివీస్ ఓపెనర్లను కోల్పోవడంతో మ్యాచ్‌పై పట్టు బిగించే అవకాశాన్ని భారత బౌలర్లు జారవిడుచుకున్నారు. ఓపెనర్ల స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన యంగ్, మిచెల్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కున్నారు. క్రీజులోకి వస్తూనే సిక్స్ బాదిన మిచెల్.. ఇన్నింగ్స్ ఆసాంతం ఏకాగ్రత కోల్పోకుండా ఆడాడు. వికెట్ల కోసం గిల్.. పదేపదే బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. అర్ధ శతకాల తర్వాత ఈ ఇద్దరూ మరింత స్వేచ్ఛగా ఆడటంతో లక్ష్యం క్రమంగా కరిగిపోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్రసిద్ధ్ క్యాచ్ మిస్చేయడంతో బతికిపోయిన మిచెల్.. 96 బంతుల్లో తన కెరీర్లో 8వ, భారత్‌పై 3వ శతకాన్ని నమోదుచేశాడు. యంగ్ నిష్క్రమించినా ఫిలిప్స్ (32*) అండతో మిచెల్ లాంఛనాన్ని పూర్తిచేశాడు. మూడో వికెట్‌కు మిచెల్, యంగ్ 162 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు.
అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ (24), గిల్ మంచి ఆరంభమే ఇచ్చారు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరూ 70 పరుగులు జోడించిన ఈ జోడీని క్లార్క్ విడదీసిన తర్వాత గిల్ సేన తడబడింది. కోహ్లీ (23) నిరాశపరచగా శ్రేయస్ అయ్యర్ (8) అతడినే అనుసరించాడు. ఈ క్రమంలో రాహుల్.. జడేజా (27), నితీశ్ (20) అండతో జట్టుకు మెరుగైన స్కోరునందించాడు.
భారత్: 50 ఓవర్లలో 284/7 (రాహుల్ 112*, గిల్ 56, క్లార్క్ 3/56, బ్రేస్‌వెల్ 1/34) ;
న్యూజిలాండ్: 47.3 ఓవర్లలో 286/3 (మిచెల్ 131*, యంగ్ 87, ప్రసిద్ధ్ 1/49, రాణా 1/52)
1 భారత్‌లో న్యూజిలాండ్‌కు పరుగులపరంగా ఇదే అత్యుత్తమ (గతంలో 283) విజయం.