India Champs | ఎడ్జ్‌బాస్టన్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ క్రికెటర్లు ఆడే ‘వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్’ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. యువరాజ్ సింగ్ సారథ్యంలోని టీమ్ఇండియా ఫైనల్లో 5 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించింది. ఈనెల 3 నుంచి 13 దాకా జరిగిన ఈ టోర్నీలో భాగంగా భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ముగిసిన ఫైనల్లో యూనిస్ ఖాన్ సారథ్యంలోని పాక్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 156/6 పరుగులు చేసింది.
షోయబ్ మాలిక్ (41) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ (3/43) రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసింది. అంబటి రాయుడు (50) అర్ధ సెంచరీతో రాణించగా గురుకీరత్ (34), యూసుఫ్ పఠాన్ (30) దూకుడుగా ఆడి భారత్ విజయాన్ని ఖాయం చేశారు.