బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ టెస్టు తొలి రోజు ఆట అదిరిపోయింది. పేస్‌కు స్వర్గధామమైన పిచ్‌పై పేసర్లు వికెట్ల పండుగ చేసుకున్నారు. పచ్చికతో కళకళలాడుతున్న పిచ్‌పై ఇరు జట్ల పేస్ బౌలర్లు 17 వికెట్లు పడగొట్టారు. ఆసీస్ పేస్ త్రయం హేజిల్‌వుడ్, స్టార్క్, కమిన్స్ ధాటికి టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది. వీరి విజృంభణతో 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్‌ను తెలుగు క్రికెటర్ నితీశ్‌రెడ్డి, పంత్ ఆదుకున్నారు. అరంగేట్రం టెస్టులోనే నితీశ్ అద్భుత పరిణతి కనబరిచాడు. భారత్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేశామనుకున్న కంగారూల సంతోషంపై బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో నీళ్లు గుమ్మరించాడు. మెక్స్వీనితో మొదలుపెట్టి ఖవాజ, స్మిత్, కమిన్స్‌ను ఔట్ చేసి పెర్త్‌పై పట్టు సాధించేలా చేశాడు. బుమ్రా, సిరాజ్ ధాటికి ఆసీస్ 67 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
Perth Test | పెర్త్: క్రికెట్ ప్రపంచంలో అగ్రశ్రేణి జట్లు అయిన భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం మొదలైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) ఆరంభం అదిరిపోయింది. పెర్త్ ఆతిథ్యమిస్తున్న తొలి టెస్టు పేస్ బౌలర్లు వికెట్ల పండుగ చేసుకోవడంతో తొలి రోజే ఏకంగా 17 వికెట్లు నేలకూలాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా.. ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి 49.4 ఓవర్లలో 150 పరుగులకే చేతులెత్తేసింది. తెలుగు కుర్రాడు, తన కెరీర్లో మొదటి టెస్టు ఆడుతున్న నితీశ్ రెడ్డి (59 బంతుల్లో 41, 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా రిషభ్ పంత్ (78 బంతుల్లో 37, 3 ఫోర్లు, 1 సిక్స్) భారత్‌ను ఆదుకున్నారు.
ఆసీస్ పేసర్లు హాజిల్‌వుడ్ (4/29), మిచెల్ స్టార్క్ (2/14), మిచెల్ మార్ష్ (2/12) సత్తా చాటారు. బ్యాటింగ్‌లో విఫలమైనా సారథి బుమ్రా (4/17) నేతృత్వంలోని భారత బౌలింగ్ దళం విజృంభించడంతో కంగారూలు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలోనే ఏడు వికెట్లు కోల్పోయి 67 పరుగులే చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. బుమ్రాకు తోడుగా సిరాజ్ (2/17), కొత్త కుర్రాడు హర్షిత్ రాణా (1/33) నిప్పులు చెరగడంతో కంగారూల టాపార్డర్ పెవిలియన్‌కు చేరింది. అలెక్స్ కేరీ (19 నాటౌట్), స్టార్క్ (6 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది.
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో అవమానకర ఓటమి కంటే భారత బ్యాటర్ల టెక్నిక్, ఆటతీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ఆసీస్ పర్యటనలోనూ మన బ్యాటర్లు అదే వైఫల్యాన్ని కొనసాగించారు. యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్ డకౌట్ అవగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న ‘రన్ మిషీన్’ విరాట్ కోహ్లీ (5)దీ అదే పేలవ ఆటతీరు! స్టార్క్ తన రెండో ఓవర్లోనే జైస్వాల్‌ను ఔట్ చేసి తొలి దెబ్బ తీయగా పడిక్కల్‌ను హాజిల్‌వుడ్ వెనక్కి పంపాడు. తనకెంతో ఇష్టమైన కంగారూల గడ్డపై విజృంభిస్తాడనుకున్న కోహ్లీని సైతం అతడే ఔట్ చేశాడు. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నప్పటికీ ఆసీస్ పేస్ త్రయాన్ని సమర్థవంతంగా ఎదుర్కుని వికెట్లకు అడ్డుగోడగా నిలిచిన రాహుల్.. థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలయ్యాడు. లంచ్ విరామానికి భారత్.. 25 ఓవర్లలో 4 కీలక వికెట్లు కోల్పోయి 51 పరుగులు మాత్రమే చేసింది. లంచ్ తర్వాత లోకల్ బాయ్ మార్ష్.. ధ్రువ్ జురెల్ (11), వాషింగ్టన్ సుందర్ (4)ను ఔట్ చేసి పర్యాటక జట్టును కోలుకోనీయకుండా చేశాడు.
73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్‌ను వికెట్ కీపర్ పంత్, అరంగేట్ర హీరో నితీశ్ రెడ్డి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 48 పరుగులు జోడించి పరువు నిలిపారు. పంత్ తన సహజశైలికి భిన్నంగా ఆడినప్పటికీ తనదైన శైలిలో కొన్ని చూడచక్కని షాట్లు ఆడాడు. మరో ఎండ్‌లో నితీశ్.. అగ్రశ్రేణి స్పిన్నర్ నాథన్ లియాన్‌తో పాటు ఆసీస్ పేసర్ల బౌలింగ్‌లోనూ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా లియాన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్లతో రెండు బౌండరీలు సాధించిన నితీశ్.. కమిన్స్ బౌలింగ్‌లో కొట్టిన అప్పర్ కట్ సిక్సర్‌ను చూసి తీరాల్సిందే. ఈ ఇద్దరూ క్రీజులో కుదురుకుంటున్న తరుణంలో ఆసీస్ సారథి.. పంత్‌ను ఔట్ చేయడంతో భారత్ మళ్లీ కష్టాల్లో పడింది. లోయరార్డర్ బ్యాటర్ల వైఫల్యంతో రెండో సెషన్లోనే భారత్ ఆలౌట్ అయింది.
బ్యాటింగ్‌లో విఫలమైనా పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత పేసర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా సారథి బుమ్రా తొలి స్పెల్ నభూతో నభవిష్యత్ అన్న రేంజ్లో సాగింది. తను వేసిన రెండో ఓవర్ మూడో బంతికి అతడు ఓపెనర్ మెక్‌స్వీనె (10)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ మరుసటి బంతికే లబూషేన్ (2) ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్స్‌లో కోహ్లీ జారవిడిచాడు. కానీ బుమ్రా ఏడో ఓవర్లో.. ఆతిథ్య జట్టుకు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. నాలుగో బంతికి ఖవాజా (8)ను ఔట్ చేసిన అతడు.. మరుసటి బంతికే ప్రమాదకర స్మిత్‌ను వికెట్ల ముంగిట బలిగొన్నాడు. రెండు ఫోర్లు కొట్టిన ట్రావిస్ హెడ్ (11)ను తొలి టెస్టు ఆడుతున్న హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆసీస్ కష్టాలు రెట్టింపయ్యాయి. ఈ క్రమంలో లబూషేన్.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. కానీ సిరాజ్.. 3 ఓవర్ల వ్యవధిలో మార్ష్ (6), లబూషేన్‌ను పెవిలియన్ చేర్చి ఆసీస్‌ను కుదురుకోనీయకుండా చేశాడు. 52 బంతులాడి 2 పరుగులే చేసిన లబూషేన్.. సిరాజ్ 17వ ఓవర్లో లెగ్ బిఫోర్‌గా ఔట్ అయ్యాడు. కమిన్స్ (3)ను బుమ్రా ఔట్ చేశాడు.
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : జస్ప్రీత్ బుమ్రా.. భారత బౌలింగ్ కోహినూర్! వైవిధ్యమైన బౌలింగ్ శైలితో ప్రత్యర్థి బ్యాటర్ల పాలిట సింహస్వప్నంలా నిలుస్తున్నాడు. షార్ట్ రనప్‌తో బుల్లెట్ లాంటి బంతులు సంధిస్తూ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. గత కొన్నేండ్లుగా టీమ్ఇండియా ప్రధాన అస్త్రంగా కొనసాగుతున్న బుమ్రా..పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను గడగడలాడించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ పిచ్‌గా పేరుగాంచిన పెర్త్‌లో బుమ్రా బౌలింగ్..కంగారూల వెన్నులో వణుకు పుట్టించింది. పేస్‌తో భారత భరతం పడుదామనుకున్న ఆస్ట్రేలియన్లు అదే ఊబిలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. సొంత ఇలాఖాలో తమకు తిరుగులేదనుకున్న ఆసీస్..బుమ్రా పట్టపగలే చుక్కలు చూపెట్టాడు. అరంగేట్రం బ్యాటర్ మెక్‌స్వీని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న బుమ్రా ఆదిలోనే కోలుకోలేని దెబ్బతీశాడు.
తన స్వింగ్ బౌలింగ్‌తో ఒకే ఓవర్లో ఉస్మాన్ ఖవాజతో పాటు లెజెండరీ స్టీవ్‌స్మిత్‌ను ఔట్ చేసి తడాఖా ఏంటో చూపెట్టాడు. కుదురుకుంటే పరుగుల వరద పారించే ఖవాజ, స్మిత్ వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చి తానేంటో మరోమారు రుచిచూపెట్టాడు. స్వింగ్‌ను సరిగ్గా అర్థం చేసుకుని ఖవా..స్లిప్‌లో కోహ్లీకి క్యాచ్ ఇస్తే స్మిత్ వికెట్ల ముందు అడ్డంగా దొరికి గోల్డెన్‌డక్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గత 100 ఏండ్లలో టెస్టుల్లో అత్యుత్తమ సగటు (20.28) నమోదు చేసిన బౌలర్‌గా బుమ్రా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. డేవిడ్సన్(ఆస్ట్రేలియా, 20.53), మాల్కం మార్షల్ (వెస్టిండీస్, 20.94), జోయల్ గార్నర్ (20.97)ను వెనుకకు నెడుతూ బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు. రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బుమ్రా.. రెండో రోజు ఆటలోనూ ఇలాగే చెలరేగితే ఆసీస్ ఖేల్‌ఖతం అయినట్లే.
1 సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత్, ఆస్ట్రేలియా టెస్టు సమరంలో తొలిసారి ఇరు జట్లకు పేస్ బౌలర్లు సారథులుగా ఉండటం ఇదే ప్రథమం
1 ఆస్ట్రేలియాలో ఒక టెస్టు తొలి రోజు ఆటలో 17 వికెట్లు నేలకూలడం 72 ఏండ్లలో ఇదే మొదటిసారి.
2 టెస్టులలో స్మిత్‌ను ఫస్ట్ బాల్కే డకౌట్ చేసిన బౌలర్లలో స్టెయిన్ తర్వాత రెండో బౌలర్ బుమ్రా.
భారత్ తొలి ఇన్నింగ్స్: 49.4 ఓవర్లలో 150 ఆలౌట్ (నితీశ్ 41, పంత్ 37, హాజిల్‌వుడ్ 4/29, మార్ష్ 2/12)
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 27 ఓవర్లలో 67/7 (కేరీ 19 నాటౌట్, హెడ్ 11, బుమ్రా 4/17, సిరాజ్ 2/17)