అజేయ భారత్! వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు ఎదురనేదే లేకుండా పోయింది. పోటీనిస్తుందనుకున్న ఆస్ట్రేలియా తొలి పోరులోనే పలాయనం చిత్తగిస్తే.. దాయాది పాకిస్థాన్ మన ఆధిపత్యానికి దాసోహమైంది. కొరుకుడుపడని కొయ్యలా మారిన కివీస్‌ను దంచేసిన రోహిత్ సేన.. భీకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న దక్షిణాఫ్రికాను గల్లీ జట్టు కన్నా హీనంగా ఓడించి మెగాటోర్నీలో ఎనిమిదో విజయం ఖాతాలో వేసుకుంది.
కింగ్ కోహ్లీ తన పుట్టిన రోజు నాడు యావత్ భారతావనికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. బొంగరం కన్నా ఎక్కువ స్పిన్ తిరుగుతున్న పిచ్‌పై మూడంకెల స్కోరుతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే సెంచరీలను సమం చేసి జట్టుకు భారీ స్కోరు అందిస్తే.. ఛేదనలో మన బౌలర్ల ధాటికి సఫారీలు కనీస ప్రతిఘటన లేకుండానే తోకముడిచారు! ఇదే జోరుతో మరో మూడు మ్యాచ్‌లు నెగ్గితే భారత్ ముచ్చటగా మూడోసారి జగజ్జేతగా నిలువడం ఖాయమే!!
CWC | కోల్‌కతా: స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా ఎనిమిదో విజయం ఖాతాలో వేసుకుంది. కష్టతరమైన పిచ్‌పై బ్యాటర్ల మొక్కవోని దీక్షకు.. బౌలర్ల సహకారం తోడవడంతో టీమ్ఇండియా అజేయంగా నిలిచింది. ఆదివారం కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన పోరులో రోహిత్ సేన 243 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. తన 35వ పుట్టినరోజు నాడు బర్త్‌డే బాయ్ విరాట్ కోహ్లీ (121 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కితే.. శ్రేయస్ అయ్యర్ (77; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అతడికి అండగా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (24 బంతుల్లో 40; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా.. రవీంద్ర జడేజా (15 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) అద్భుత ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జాన్సెన్, రబడ, కేశవ్ మహరాజ్, షంసీ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకు ఆలౌటైంది. నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు చేయగా.. ఒక్కరు కూడా 15 పరుగుల మార్క్ దాటలేకపోయారు. వరల్డ్‌కప్‌లో సెంచరీల మోత మోగిస్తున్న డికాక్ (5), బవుమా (11), డసెన్ (13), మార్క్మ్ (9), క్లాసెన్ (1), మిల్లర్ (11), జాన్సెన్ (14) ఇలా ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొడితే.. మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. రికార్డు సెంచరీ బాదిన కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. టీమ్ఇండియా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆదివారం నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
ఏమని వర్ణించను..
పుష్కర కాలం క్రితం స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా విజయం సాధించిన అనంతరం.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను భుజాలమీద ఎత్తుకొని తిరిగిన ఆ పాల బుగ్గల పసివాడు.. పన్నెండేండ్లు తిరిగేసరికి మాస్టర్ బ్లాస్టర్ సరసన చేరాడు. వన్డే ఫార్మాట్లో సచిన్ నెలకొల్పిన 49 శతకాల రికార్డును తిరగరాయడం అసాధ్యం అనుకుంటే.. దాన్ని అవలీలగా సుసాధ్యం చేసి చూపాడు. గాడ్ ఆఫ్ క్రికెట్‌కు ఈ మార్క్ చేరేందుకు 451 ఇన్నింగ్స్‌లు అవసరమైతే.. కేవలం 277 ఇన్నింగ్స్‌ల్లోనే అతడు దాన్ని అందుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లోనే తొలి వన్డే సెంచరీ నమోదు చేసుకున్న ఆ ఆధునిక క్రికెట్ దేవుడు.. పుట్టినరోజు నాడు తన గురువు రికార్డును సమం చేసి శభాష్ అనిపించుకున్నాడు. మనం ఇంతసేపు చెప్పుకున్నది విరాట్ కోహ్లీ గురించే! టెండూల్కర్ ఆడిన చివరి వన్డేలో పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీతో సరిపెట్టుకుంటే.. అదే పోరులో మాస్టర్ ఘనతలను ముందుకు తీసుకెళ్లడానికి నేనొస్తున్నాను అని దాయాది బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ 183 పరుగులు చేసిన విరాట్ ఆటతీరును ప్రశంసించేందుకు మాటలు కరువయ్యే పరిస్థితి తీసుకొచ్చాడు! ఏమని చెప్పగలం అతడి గురించి.. ఎంతని చెప్పగలం.. అంతర్జాతీయ క్రికెట్‌పై చెరగని ముద్ర వేసుకున్న కోహ్లీ గురించి రాస్తే రామాయణం.. చెప్తే మహాభారతమే అవుతుంది!
అద్భుతంగా ఆడావు విరాట్ శుభాకాంక్షలు. నేను ఈ ఏడాది 49 నుంచి 50లోకి అడుగు పెట్టడానికి 365 రోజులు పట్టింది. నువ్వు త్వరలోనే నా రికార్డు బద్దలు కొట్టి వన్డేల్లో 50వ సెంచరీ పూర్తి చేసుకుంటావని ఆశిస్తున్నా.
-సచిన్ టెండూల్కర్
నీ దెబ్బతో కెరీర్‌కు చరమగీతం పాడిన ప్రత్యర్థి బౌలర్లను అడిగితే తెలుస్తుందేమో నీ గొప్పతనం ఏంటో!
నీ దెబ్బకు పదే పదే బౌండ్రీ తాడును ముద్దాడే బంతిని అడిగితే చెబుతుందేమో మా కన్నా మిన్నగా!
నువ్వు కొట్టిన బౌండ్రీలకు, సిక్సర్లకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిన అంపైర్లను అడిగితే తెలుస్తుందేమో.. నీ కవర్ డ్రైవ్ కళాత్మకత ఏంటో!
నాన్ స్ట్రయికింగ్ ఎండ్ నుంచి చూసిన సహచర ఆటగాళ్లను అడిగితే మరింత బాగా వర్ణిస్తారేమో ఆ విరాట పర్వాన్ని..!
నీ కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి స్కోరర్లుగా కొనసాగుతున్న వాళ్లను అడిగితే తెలుస్తుందేమో.. నీ అంకెల గారడీ ఎంత గొప్పదో!
బౌండ్రీ బయట కూర్చున్న బాల్ బాయ్స్‌ను అడిగితే తెలుస్తుందేమో నీ స్ట్రయిట్ డ్రైవ్‌లో ఉన్న వేగమెంతో!
సచిన్ రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ చూడటమే మానేసి.. ఆ తర్వాత నీ వీరత్వానికి గులామైన కోట్లాది మంది వీరాభిమానులను అడిగితే బాగా చెప్తారేమో!
వేనోళ్ల పొగిడినా తనివి తీరని నీ అద్భుత ఆటతీరును ఏమని వర్ణించగలం!!
సంక్షిప్త స్కోర్లు
భారత్: 326/5 (కోహ్లీ 101 నాటౌట్, శ్రేయస్ 77; కేశవ్ 1/30), దక్షిణాఫ్రికా: 27.1 ఓవర్లలో 83 ఆలౌట్ (జాన్సెన్ 14; జడేజా 5/33, కుల్దీప్ 2/7).