అద్భుతం ఆవిష్కృతమైంది! కోట్లాది భారతీయుల ఆశలను తమ భుజస్కంధాలపై మోసుకుంటూ భారత క్రికెట్ జట్టు ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. చరిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా న్యూజీలాండ్‌తో బుధవారం జరిగిన సెమీఫైనల్ పోరులో టీమ్ఇండియా 70 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది. విరాట్ కోహ్లీ (113 బంతుల్లో 117, 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత సెంచరీకి తోడు శ్రేయస్ అయ్యర్ (70 బంతుల్లో 105, 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో భారత్ 397/4 పరుగుల భారీ స్కోరు చేసింది.
తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (49) సెంచరీల రికార్డును అధిగమిస్తూ వాంఖడేలో విరాట్ సింహనాదం చేశాడు. కివీస్ బౌలర్లను చీల్చిచెండాడుతూ వన్డేల్లో 50వ సెంచరీని తన పేరిట లిఖించుకుని ‘కింగ్ ఆఫ్ క్రికెట్’ అని చేతల్లో చూపించాడు. ఈ క్రమంలో ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల (711) రికార్డుతో టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్నాడు. భారీ లక్ష్యఛేదనలో మహమ్మద్ షమీ (7/57) బౌలింగ్ విజృంభణతో కివీస్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. మిచెల్(134) ఒంటరి పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. ఓవరాల్‌గా మెగాటోర్నీలో నాలుగోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్ ముచ్చటగా మూడోసారి కప్‌ను ముద్దాడేందుకు మరో అడుగుదూరంలో ఉంది.
భారత్ సాధించింది..
గత రెండుసార్లు ప్రపంచకప్ సెమీఫైనల్లో తడబడ్డ టీమ్ఇండియా.. ఈ సారి ఆ అడ్డంకిని దాటుకొని ఫైనల్లో అడుగుపెట్టింది.
140 కోట్ల మంది ఆశీర్వచనాలతో స్వదేశంలో అజేయంగా సాగుతున్న రోహిత్‌సేన.. వరల్డ్‌కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి.. 2019 సెమీస్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.వాంఖడే స్టేడియంలో ఒకవైపు మెరైన్ డ్రైవ్ మరోవైపు అభిమానుల నీలి సముద్రం సాక్షిగా కివీస్ భరతం పడుతూ భారత్ దుమ్మురేపింది!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొడుతూ.. విరాట్ కోహ్లీ 50వ వన్డే సెంచరీతో అదరగొడితే.. శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శతకంతో కదంతొక్కాడు. రోహిత్ శర్మ తనకు అలవాటైన రీతిలో జట్టుకు మెరుపు ఆరంభాన్నిస్తే.. శుభ్‌మన్ గిల్ కండరాలు పట్టేసినా సడలని పట్టుదలతో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక చివర్లో కేఎల్ రాహుల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
ఫలితంగా వరల్డ్‌కప్ నాకౌట్లోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత్.. అభిమానులను ఆనంద డోలికల్లో ముచెత్తింది.
ఇంకేముంది భారత్ విజయం నల్లేరు మీద నడకే అనుకుంటే.. న్యూజిలాండ్ పట్టు వీడలేదు. 220/2తో ఒక దశలో తీవ్ర ప్రతిఘటన కనబర్చింది. డారిల్ మిషెల్ భారీ సెంచరీకి కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ దంచుడు తోడవడంతో.. భారత శిబిరంలో ఆందోళన నెలకొనగా.. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ నేనున్నానంటూ బాధ్యతను భూజానెత్తుకున్నాడు. టీమ్‌కు అవసరమైన ప్రతీసారి వికెట్ పడగొట్టి.. ఏడుగురు బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించి జట్టుకు అపురూపమైన విజయాన్ని అందించాడు.
పుష్కర కాలం తర్వాత స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడిన పది మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన టీమ్ఇండియా.. ఇక ఆదివారం అహ్మదాబాద్‌లో జరుగనున్న ఫైనల్లో రెండో సెమీస్ విజేతతో అమీతుమీ తేల్చుకోనుంది!
ముంబై: టీమ్ఇండియా రికార్డు స్థాయిలో వరుసగా పదో విజయంతో వరల్డ్‌కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి నాలుగోసారి ప్రపంచకప్ తుదిపోరుకు అర్హత సాధించింది. 2015, 2019లో సెమీఫైనల్లో పరాజయాలు ఎదుర్కొన్న రోహిత్ సేన.. ఈ సారి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విశ్వరూపం కనబర్చింది. పూర్తి సన్నద్ధతతో మెగాటోర్నీలో అడుగుపెట్టిన టీమ్ఇండియా.. సెమీస్‌లోనూ అదే జోరు కొనసాగించింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. కింగ్ కోహ్లీ (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వన్డేల్లో 50వ సెంచరీ నమోదు చేసుకుంటే.. శ్రేయస్ అయ్యర్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు శతకంతో ఆకట్టుకున్నాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి జట్టుకు అద్భుతమైన ఆరంభాన్నివ్వగా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (66 బంతుల్లో 80 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. చివర్లో కేఎల్ రాహుల్ (20 బంతుల్లో 39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) విలువైన పరుగులు జోడించాడు.
ఫలితంగా భారత్ నాకౌట్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చుతూ.. కొండంత స్కోరు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిషెల్ (119 బంతుల్లో 134; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ సెంచరీతో ఆకట్టుకోగా.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (69; 8 ఫోర్లు, ఒక సిక్సర్), గ్లెన్ ఫిలిప్స్ (41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడారు. భారత బౌలర్లలో షమీ 7 వికెట్లతో చరిత్ర సృష్టించగా.. బుమ్రా, సిరాజ్, కుల్దీప్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆస్ట్రేలియాతో లీగ్ మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని దాదాపు ఛేదించినంత పనిచేసిన న్యూజిలాండ్.. ఈ సారి కూడా భయపెట్టింది. ఒక దశలో కివీస్‌కు చేజింగ్ పెద్ద కష్టం కాదు అనిపించినా.. షమీ తన అద్వితీయ బౌలింగ్‌తో న్యూజిలాండ్‌ను ఇంటి బాట పట్టించాడు. షమీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. గురువారం రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ విజేతతో ఆదివారం అహ్మదాబాద్‌లో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 397/4 (కోహ్లీ 117, శ్రేయస్ 105; సౌథీ 3/100), న్యూజిలాండ్: 48.5 ఓవర్లలో 327 ఆలౌట్ (డారిల్ 134, విలియమ్సన్ 69; షమీ 7/57).
గురువును మించిన శిష్యుడు
అండర్-19 ప్రపంచకప్‌లో రాణించి.. తొలిసారి భారత జట్టుకు ఎంపికైన విరాట్ కోహ్లీని డ్రెస్సింగ్ రూమ్‌లో అప్పటి సీనియర్లు ర్యాగింగ్ చేశారు. టీమ్‌లోకి కొత్తగా ఎవరు వచ్చినా.. మొదట సచిన్ టెండూల్కర్ కాళ్లు మొక్కాలని.. అది డ్రెస్సింగ్ రూమ్ నియమమని ఆట పట్టించారు. నిజమే అనుకున్న కోహ్లీ మారు మాట్లాడకుండా మాస్టర్ కాళ్ల మీద పడ్డాడు. ఇదంతా ముందే తెలిసినా.. సహచరుల చిలిపి చేష్టలకు ముసిముసి నవ్వులు నవ్వుకున్న సచిన్ టెండూల్కర్.. ఇన్నేండ్ల తర్వాత ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీల రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీపై ఎక్స్ వేదికగా.. సచిన్ ప్రశంసలు కురిపించాడు.
‘తొలిసారి నిన్ను (కోహ్లీ) భారత డ్రెస్సింగ్ రూమ్‌లో కలిసినప్పుడు.. సహచరుల ప్రోద్బలంతో నా పాదాలను తాకావు. ఆ సమయంలో నవ్వు ఆపుకోలేకపోయా. కానీ అనతి కాలంలోనే ఆటపట్ల నీకున్న అంకితభావం.. నైపుణ్యంతో నువ్వు నా మనసును తాకావు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఓ చిన్న కుర్రాడు.. ఇప్పుడు ఇలా ‘విరాట్’ ప్లేయర్‌గా ఎదగడం సంతోషాన్నిస్తుంది. నా రికార్డులు భారతీయుడు బద్దలు కొట్టడం కంటే గొప్ప విషయం ఇంకేముంటుంది. అదీ ప్రపంచకప సెమీఫైనల్ లాంటి పెద్ద మ్యాచ్‌లో.. నా సొంత మైదానంలో కావడం మరింత ప్రత్యేకం’ అని సచిన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. ఇక ఆ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత మైదానంలో ఉన్న సచిన్ వైపు వినయపూర్వకంగా చూస్తూ సంజ్ఞలు చేసిన కోహ్లీ..తన హీరోకు ప్రత్యేక అభివాదం చేశాడు.
షమీ శత్రు వినాశనం
వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓ ఆటగాడు తన కెరీర్లో 50వ వన్డే సెంచరీ పూర్తి చేసుకొని క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టినా.. అతడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కలేదు! వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీ.. అందులోనూ వేగవంతమైన శతకం.. నాలుగో స్థానంలో రికార్డు స్థాయి పరుగులు.. ఇలా ఎన్నో ఘనతలు సాధించిన మరో ప్లేయర్‌కు కూడా ఆ అవార్డు దక్కలేదు!! సాధారణంగా భారీ స్కోర్ల మ్యాచ్‌లో అందుకు పాటుపడిన ఆటగాడికి ఆ అవార్డు దక్కడం పరిపాటే.. కానీ, వాంఖడే పోరులో మాత్రం నిర్వాహకులు అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. ఓ బౌలర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రకటించారు. అంటే అతడేదో ప్రత్యేకమైంది సాధించాడని కొత్తగా చెప్పాల్సిన పనిలేదుగా!
ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నయ్యా..
బుల్లెట్టు దిగిందా లేదా..
ప్రత్యర్థి ఎవరన్నది కాదు..
వికెట్ నేలకూలిందా లేదా!
టాపార్డరా, టెయిలెండరా జాన్తానై..
బాల్ వేస్తే డగౌట్ బాట పట్టాల్సిందే!
కొత్త బంతా.. పాత బంతా అనేది అనవసరం.. అతడి చేతికి వస్తే స్వింగ్ అవ్వాల్సిందే!
ఈ ప్రపంచకప్‌లో ఆలస్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న మహమ్మద్ షమీ.. మరోసారి తన విలువ చాటుకున్నాడు. లీగ్ దశలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో సత్తాచాటిన ఈ ఉత్తరప్రదేశ్ పేసర్.. ఈ సారి అంతకుమించి ప్రదర్శనతో రెచ్చిపోయాడు. అసలు బంతిని ఆడాలా వద్దా అనే సంశయంలో పడేస్తూ.. కివీస్ బ్యాటర్లను క్రీజులోనే చెడుగుడాడుకున్నాడు. తన తొలి బంతికే కాన్వే (13)ను ఔట్ చేసిన షమీ.. తదుపరి ఓవర్లో రచిన్ రవీంద్ర (13)ను వెనక్కి పంపాడు. నాలుగు ఓవర్ల తొలి స్పెల్‌లో కివీస్‌కు చుక్కలు చూపిన లాలా.. ఆ తర్వాత కేన్ విలియమ్సన్, డారిల్ మిషెల్ భాగస్వామ్యాన్ని విడదీసి మరోసారి జట్టును పోటీలోకి తెచ్చాడు. లాథమ్ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న షమీ.. డారిల్ మిషెల్‌ను ఔట్ చేసి ఐదు వికెట్లు పూర్తి చేసుకున్నాడు. కివీస్ టాప్-5 బ్యాటర్లందరూ షమీకే వికెట్ సమర్పించుకోవడం గమనార్హం.. చివర్లో మరో రెండు వికెట్లు తీసిన లాలా.. ఈ వరల్డ్‌కప్‌లో అత్యుత్తమ గణాంకాలతో పాటు.. మెగాటోర్నీల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
1 వరల్డ్‌కప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు (17 ఇన్నింగ్స్‌ల్లో) తీసిన బౌలర్‌గా షమీ రికార్డుల్లోకెక్కాడు.
ఒక ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు (23) తీసిన భారత బౌలర్‌గా షమీ నిలిచాడు.
4 వరల్డ్‌కప్ ఫైనల్ చేరడం భారత్‌కు ఇది నాలుగోసారి. 1983, 2003, 2011లో తుదిపోరుకు అర్హత సాధించింది. అందులో రెండుసార్లు (1983, 2011లో) విశ్వ విజేతగా నిలిచింది.
Anushka
ధోనీ రనౌట్‌కు.. సూపర్ కౌంటర్
2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో లక్ష్యఛేదన చివర్లో మిస్టర్ కూల్ ధోనీ రనౌట్ రూపంలో వెనుదిరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో నిస్సహాయంగా కూర్చున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కళ్ల నిండా నీళ్లతో నిరాశగా కనిపించారు! ఆ దృశ్యాలను మనసులో ముద్రించుకున్న ఈ ఇద్దరూ ఈ సారి ఎలాగైనా వదలకూడదనే లక్ష్యంతో మైదానంలో తమ కసి కనబర్చారు. మ్యాచ్‌లో కోహ్లీ, శ్రేయస్ సెంచరీలు చేసినా.. అసలు జట్టుకు అవసరమైన పునాది వేసింది మాత్రం ముమ్మాటికీ రోహితే! లెఫ్టార్మ్ పేసర్ల బౌలింగ్‌లో మనవాళ్లు తడబడతారు.. నాకౌట్ మ్యాచ్‌ల్లో టాపార్డర్ తుస్సుముంటుంది..
అనే శుష్క వాదనలను పక్కకు నెడుతూ.. దీపావళి ముగిసిన తర్వాత కూడా పటాకుల మోత తగ్గనివ్వకుండా రోహిత్ రెచ్చిపోయాడు. వాంఖడేలో వందల కొద్ది మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న హిట్‌మ్యాన్.. కివీస్ బౌలర్లను ఆటాడుకున్నాడు. బంతి కాస్త గతితప్పితే చాలు దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడుతూ.. స్టాండ్స్‌లోకి తరలించాడు.
రోహిత్ శుభారంభం అందించాక.. ఇక అక్కడి నుంచి భారత్ వెనుదిరిగి చూసుకోలేదు. మొదట్లోనే న్యూజిలాండ్ బౌలింగ్ దాడిని కకావికలం చేసేయడంతో.. కివీలు లయ అందుకునేందుకు ఇబ్బందిపడగా.. మిడిల్ ఓవర్స్‌లో కోహ్లీ తన అనుభవాన్ని చాటాడు. స్పిన్నర్లు మెరుగ్గా బౌలింగ్ వేస్తున్న సమయంలో వెనక్కి తగ్గిన కోహ్లీ.. ఒక్కసారి కుదురుకున్నాక స్పిన్, పేస్ అనే తేడా లేకుండా చెలరేగిపోయాడు. కండరాలు పట్టేయడంతో గిల్ మైదానాన్ని వీడగా.. శ్రేయస్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
50 వన్డేల్లో విరాట్ సెంచరీల సంఖ్య. సచిన్ టెండూల్కర్ (49)ను దాటేసి అగ్రస్థానానికి చేరాడు. రోహిత్ (31) మూడో స్థానంలో ఉన్నాడు.
1 ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక (27) సిక్సర్లు కొట్టిన జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. గేల్ (26; 2015) రెండో స్థానంలో ఉన్నాడు.
ఒక ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు (711) చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. సచిన్ (674; 2003లో) రెండో స్థానంలో ఉన్నాడు.
వెల్డన్ విరాట్‌కోహ్లీ. వన్డేల్లో సెంచరీల హాఫ్ సెంచరీ చేశావు. ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇలాంటి అరుదైన ఘనత సాధించడం అద్భుతం. నీ ప్రతిభకు వందనం విరాట్
– మంత్రి కేటీఆర్
టీమ్ఇండియాకు అభినందనలు. వాట్ ఏ షమీ ఫైనల్! అద్భుత ప్రదర్శనతో షమీ మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచాడు. వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీకి వందనం. ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అద్భుత ప్రదర్శన కనబరిచింది
– మంత్రి హరీశ్‌రావు
ముంబై నడిగడ్డపై అద్భుతం ఆవిషృతమైంది. కోహ్లీ కేవలం బౌండరీలే కాదు రికార్డులు కొల్లగొడుతున్నాడు. ప్రపంచకప్ సెమీఫైనల్లో అద్భుత ఫీట్ ద్వారా భారత క్రికెట్ అభిమానులనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను అలరించాడు. కోహ్లీని చూసి అందరం గర్విస్తున్నాం
– ఎమ్మెల్సీ కవిత
3 వన్డేల్లో అత్యధిక (13794) పరుగులు చేసిన జాబితాలో కోహ్లీ మూడో స్థానానికి చేరాడు. సచిన్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. కుమార సంగక్కర (14,234) రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
7/57 ఈ మ్యాచ్‌లో షమీ గణాంకాలు. వరల్డ్‌కప్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమం.
2011 తర్వాత భారత్ తొలిసారి ఫైనల్ చేరింది. 2015, 19లో సెమీస్‌లో ఓటమి పాలైంది. ఓవరాల్‌గా టీమ్ఇండియా వరల్డ్‌కప్ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి.
397/4 వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇదే అత్యధిక స్కోరు. 2015 మెగాటోర్నీ క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ చేసిన 393/6 రెండో స్థానానికి చేరింది.
19 ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కొట్టిన సిక్సర్లు. వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇదే అత్యధికం.
8 వన్డే ప్రపంచకప్‌లో 50+స్కోరు చేయడం కోహ్లీకి ఇది ఎనిమిదోసారి. మెగాటోర్నీలో ఇదే అత్యధికం. సచిన్, షకీబ్ (7) రెండో స్థానంలో ఉన్నారు.
కోహ్లీ సెంచరీలు.. ఏ దేశంపై ఎన్ని..
శ్రీలంకపై : 10
వెస్టిండీస్‌పై : 9
ఆస్ట్రేలియాపై : 8
న్యూజిలాండ్‌పై : 6
బంగ్లాదేశ్‌పై : 5
దక్షిణాఫ్రికాపై : 5
ఇంగ్లండ్‌పై : 3
పాకిస్థాన్‌పై : 3
జింబాబ్వేపై : 1