వరుస విజయాల పరంపర కొనసాగించిన భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు.. అద్వితీయ ప్రదర్శనతో రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాతాలో వేసుకుంది. కువైట్‌తో ఆఖరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన తుది పోరులో స్కోర్లు సమమైనా.. షూటౌట్లో సత్తాచాటిన ఛెత్రీ సేన కప్పు కొల్లగొట్టింది.
బెంగళూరు: భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (సాఫ్) టైటిల్ కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో కువైట్‌పై షూటౌట్లో నెగ్గిన సునీల్ ఛెత్రీ సేన తొమ్మిదోసారి సాఫ్ కప్ చేజిక్కించుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలువగా విజేతను తేల్చేందుకు నిర్వహించిన షూటౌట్లో భారత్ 5-4తో కువైట్‌ను చిత్తుచేసింది. తుదిపోరులో భారత్ తరఫున లాలియన్జులా (39వ నిమిషంలో) ఓ గోల్ చేయగా.. కువైట్‌కు షబీబ్ అల్ ఖల్దీ (14వ ని.లో) ఓ గోల్ అందించాడు. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా.. ఆధిక్యం సాధించలేకపోవడంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్‌కు వెళ్లింది. అందులోనూ ఇరు జట్లు గోల్ చేయలేకపోవడంతో షూటౌట్ నిర్వహించగా.. ఛెత్రీ సేన దుమ్మురేపింది.
భారత్ తరఫున స్టార్ స్ట్రయికర్ ఛెత్రీతో పాటు నలుగురు గోల్స్ నమోదు చేయగా.. కువైట్ నుంచి కూడా నలుగురు ఆటగాళ్లు బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపారు. దీంతో సడెన్ డెత్ నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో భారత్ ఓ గోల్ సాధించగా.. ప్రత్యర్థి ప్రయత్నాన్ని అడ్డుకున్న మన గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు అభిమానులను సంబురాల్లో ముంచెత్తాడు. ఇరు జట్ల మధ్య ప్రధాన తేడాగా నిలిచిన గురప్రీత్ ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. గ్రూప్ దశలో కువైట్‌తో జరిగిన మ్యాచ్‌ను సైతం 1-1తో ‘డ్రా’ చేసుకున్న విషయం తెలిసిందే. సెమీఫైనల్లో లెబనాన్‌పై షూటౌట్లోనే నెగ్గి ముందంజ వేసిన ఛెత్రీ సేన వరుసగా రెండో మ్యాచ్‌లో షూటౌట్లో సత్తాచాటడం విశేషం. పెనాల్టీ షూటౌట్లో భారత్ తరఫున కెప్టెన్ ఛెత్రీతో పాటు సందేశ్, సుభాశిశ్, చాంగ్టే, మహేశ్ గోల్స్ చేయగా.. ఉదాంత సింగ్ మిస్ చేశాడు.