 
                                                            అమ్మాయిలు అద్భుతం చేశారు! ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న రీతిలో ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఏడుసార్లు విజేత, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపిస్తూ భారత్ వన్డే ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పరుగుల వరద పారిన ముంబై డీవై పాటిల్ స్టేడియంలో కంగారూలను కసిగా వేటాడుతూ ఏడేండ్ల తర్వాత టీమ్ఇండియా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. వన్డేల్లో రికార్డు లక్ష్యాన్ని అలవోకగా ఛేదిస్తూ మన అమ్మాయిలు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అబేధ్యమైన ఆసీస్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ ముచట్చగా మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. ముంబై చిచ్చరపిడుగు జెమీమా రోడ్రిగ్స్ వీరోచిత సెంచరీతో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ అండగా ఆసీస్‌ను కంగారెత్తించిన రోడ్రిగ్స్ చారిత్రక ఇన్నింగ్స్‌తో కదంతొక్కింది. ఓవైపు సహచరులు నిష్క్రమిస్తున్నా..మొక్కవోని పట్టుదలతో భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. అశేష అభిమానుల మద్దతు మధ్య ఆసీస్‌ను నాకౌట్ చేసింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
ముంబై : సొంతగడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత అమ్మాయిలు సంచలన బ్యాటింగ్‌తో ఫైనల్ చేరారు. గ్రూప్ దశలో అభిమానులు ఆశించిన స్థాయిలో ఆడలేక తడబడ్డ భారత్.. కీలక సెమీస్ పోరులో మాత్రం అంచనాలకు మించి దుమ్మురేపింది. నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన రెండో సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించి 8 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత సగర్వంగా ఫైనల్ చేరింది. ఆసీస్ నిర్దేశించిన 339 పరుగుల రికార్డు ఛేదనను భారత్.. మరో ఆరు తొమ్మిది బంతులు మిగిలుండగానే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక ఛేదనను విజయవంతంగా పూర్తిచేసింది. ఛేదనలో జెమీమా రోడ్రిగ్స్ (134 బంతుల్లో 127 నాటౌట్, 14 ఫోర్లు) తన కెరీర్లోనే మరుపురాని శతకంతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 89, 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 49.5 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోరు చేసింది. యువ ఓపెనర్ ఫొబె లిచ్‌ఫీల్డ్ (93 బంతుల్లో 119, 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకంతో కదం తొక్కగా ఎల్లీస్ పెర్రీ (88 బంతుల్లో 77, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆష్లే గార్డ్నర్ (45 బంతుల్లో 63, 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఫిఫ్టీలతో రాణించారు. జెమీమాకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో భారత్.. నవంబర్ 2న ఇదే వేదికలో దక్షిణాఫ్రికాతో టైటిల్ పోరులో తలపడనుంది. ఈ పోరులో ఎవరు గెలిచినా వరల్డ్ కప్‌లో అభిమానులు కొత్త విజేతను చూడబోతున్నారు.
జెమీమా వీరోచితం : నిర్దేశిత భారీ లక్ష్యఛేదనలో భారత్‌కు మెరుగైన శుభారంభం దక్కలేదు. ప్రతీకా రావల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఓపెనర్ షెఫాలీవర్మ(10) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మెగాటోర్నీలో సూపర్ ఫామ్‌మీదున్న స్మృతి మందనకు ఫస్డ్డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన రోడ్రిగ్స్ జత కలిసింది. వీరిద్దరు ఆసీస్ బౌలింగ్‌ను నిలువరిసూ ఇన్నింగ్స్ ముందుకు నడిపించారు. గాడిలో పడిందనుకుంటున్న తరుణంలో గార్త్ బౌలింగ్‌లో బంతిని లెగ్‌సైడ్ ఆడబోయిన మందన..అనూహ్య రీతిలో ఔటైంది. 59 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియా ఇన్నింగ్స్ బాధ్యతను రోడ్రిగ్స్‌తో పాటు హర్మన్పీత్ భుజానేసుకున్నారు. వీరిద్దరు ఎక్కడా చెత్తషాట్లకు పోకుండా లక్ష్యాన్ని అంతకంతకూ కుదించే ప్రయత్నం చేశారు. ఇదే మెగాటోర్నీలో రెండుసార్లు డకౌట్ అయిన రోడ్రిగ్స్..సెమీస్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. ఆదిలో నెమ్మదిగా ఆడిన కౌర్.. అర్ధ సెంచరీ తర్వాత దూకుడు పెంచింది. మరో ఎండ్‌లో రోడ్రిగ్స్..అలనా కింగ్ బౌలింగ్‌లో కీపర్ హిలీ క్యాచ్ విడిచిపెట్టడంతో దక్కిన చాన్స్‌ను చక్కగా వాడుకుంది. లక్ష్యం దిశగా సాగుతున్న క్రమంలో సదర్లాండ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన కౌర్.. గార్డ్నర్ సూపర్ క్యాచ్‌తో ఔటైంది. దీంతో మూడో వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత దీప్తిశర్మతో రోడ్రిగ్స్ జతకట్టింది. సెంచరీ పూర్తి చేసుకున్నా..సంబురాలు చేసుకోని రోడ్రిగ్స్ జట్టు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగింది. అయితే లేని పరుగు కోసం ప్రయత్నించిన దీప్తి రనౌట్ కాగా, రీచా ఘోష్ తనదైన దూకుడుతో ఆసీస్ బౌలర్లను మరింత ఒత్తిడిలోకి నెట్టింది. సదర్లాండ్ బౌలింగ్‌లో గార్త్ క్యాచ్‌తో రీచా నిష్క్రమించగా, ఆఖర్లో అమన్‌జ్యోత్(15 నాటౌట్)తో కలిసి రోడ్రిగ్స్‌ను జట్టును ఒడ్డుకు చేర్చింది.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను లిచ్‌ఫీల్డ్ ధాటిగా మొదలెట్టింది. క్రాంతి వేసిన రెండో ఓవర్లో రెండు బౌండరీలతో పరుగుల వేటను ప్రారంభించిన 22 ఏండ్ల ఈ ఆసీస్ అమ్మాయి.. తన ఇన్నింగ్స్ ఆసాంతం అదే దూకుడును కొనసాగించింది. ఆరో ఓవర్లో క్రాంతి.. హీలి (5)ని బౌల్డ్ చేసినా ఆ ఆనందం భారత్‌కు ఎంతోసేపు దక్కలేదు. లిచ్‌ఫీల్డ్ బౌండరీలతో భారత బౌలర్లను బెంబేలెత్తించింది. క్రాంతి 10వ ఓవర్లో మూడు బౌండరీలు బాదిన ఆమె.. చరణి బౌలింగ్‌లో మిడాఫ్ దిశగా ఫోర్ కొట్టి అర్ధ సెంచరీ సాధించింది. మరో ఎండ్‌లో పెర్రీ సైతం వేగంగా ఆడటంతో ఆసీస్ రన్‌రేట్ ఓవర్‌కు ఏడుకు తగ్గకుండా సాగింది.లిచ్‌ఫీల్డ్.. మిడాఫ్ మీదుగా బంతిని బౌండరీకి తరలించి వరల్డ్ కప్ కెరీర్లో తొలి శతకాన్ని నమోదుచేసింది. ఒకదశలో 400 వరకు చేస్తుందనుకున్న ఆసీస్‌ను కట్టడిచేయడంలో సఫలమయ్యారు. ఆఖర్లో గార్డ్నర్ వీరవిహారం చేయడంతో ఆస్ట్రేలియా.. ప్రత్యర్థి ఎదుట భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.

1 ఓవరాల్‌గా వన్డే క్రికెట్లో రికార్డు లక్ష్యఛేదన(339) భారత్ పేరిట నమోదైంది
ఆస్ట్రేలియా: 49.5 ఓవర్లలో 338 ఆలౌట్ (లిచ్‌ఫీల్డ్ 119, పెర్రీ 77, చరణి 2/49, దీప్తి 2/73);
భారత్: 48.3 ఓవర్లలో 341/5 (జెమీమా 127*, హర్మన్‌ప్రీత్ 89, గార్త్ 2/46, సదర్లాండ్ 2/69)
 
                            