అండర్-19 ప్రపంచకప్‌లో అపజయం ఎరగకుండా దూసుకెళ్తున్న యువభారత జట్టు.. నేడు టైటిల్ ఫైట్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. రికార్డు స్థాయిలో తొమ్మిదో ఫైనల్ ఆడుతున్న యంగ్‌ఇండియా.. ఆరోసారి కప్పు కొడుతుందా.. లేక సీనియర్ల మాదిరిగా కంగారూల చేతిలో కంగుతింటుందా నేడు తేలనుంది!
U-19 World Cup | బెనోనీ: అప్రతిహత విజయాలతో దూకుడు మీద ఉన్న యువ భారత జట్టు.. ఆదివారం అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. టోర్నీ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో ఇప్పటి వరకు ఐదుసార్లు జగజ్జేతగా నిలిచిన యంగ్‌ఇండియా సిక్సర్ బాదాలని చూస్తుంటే.. సీనియర్ల వరల్డ్‌కప్ ఫైనల్లో రోహిత్‌సేనను ఓడించినట్లు.. యువభారత్‌ను నిలువరించాలని కంగారూలు కాచుకొని ఉన్నారు. లీగ్ దశ మొదలుకొని.. సెమీస్ వరకు ప్రతి జట్టుపై సాధికారిక విజయం సాధించి ముందడుగు వేసిన యంగ్‌ఇండియా తుదిపోరులోనూ అదే దూకుడు కొనసాగించాలని చూస్తున్నది. కెప్టెన్ ఉదయ్ సహరన్‌తో పాటు అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, సచిన్ దాస్ మంచి ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం.
ఇప్పటికే ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న తెలంగాణ కుర్రాడు అరవెల్లి అవనీశ్రావుతో వికెట్ కీపర్‌గా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. బౌలింగ్‌లో రాజ్ లింబాని, నమన్ తివారి, సామీ కుమార్, మురుగన్ అభిషేక్ కీలకం కానున్నారు. గతంలో అండర్-19 స్థాయిలో మెరిసి ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్, సురేశ్ రైనా, శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా, రాహుల్, పంత్, గిల్, యశస్వి మాదిరిగా.. పేరు ప్రఖ్యాతలు దక్కించుకునేందుకు కుర్రాళ్లకు ఇది చక్కటి అవకాశం కానుంది. మరోవైపు గతంలో రెండుసార్లు (2012, 2018లో) తుదిమెట్టుపై భారత్ చేతిలో ఓడిన ఆసీస్.. ఈసారి కప్పు కొట్టాలని కృతనిశ్చయంతో ఉంది.