పగుళ్లు తేలిన పిచ్‌పై బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డ టీమ్ఇండియా.. ప్రత్యర్థికి పైచేయి సాధించే అవకాశం ఇచ్చింది. సహచరులు విఫలమైన చోట ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ రూట్ అజేయ సెంచరీతో జట్టుకు మంచి స్కోరు సాధించిపెట్టగా.. అలాంటి పోరాటం మన టీమ్‌లో కరువైంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ అర్ధశతకంతో రాణించినా.. తక్కినవాళ్లు విఫలమవడంతో.. రాంచీ టెస్టులో రోహిత్ సేన కష్టాల్లో పడింది. మిగిలిన మూడు వికెట్లతో మనవాళ్లు మరెన్ని పరుగులు జోడిస్తారో చూడాలి!
Team India | రాంచీ: యువ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ (4/84) ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో.. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో టీమ్ఇండియా కష్టాల్లో పడింది. శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (73; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో రాణించగా.. శుభ్‌మన గిల్ (38), ధ్రువ్ జురెల్ (30 బ్యాటింగ్) పర్వాలేదనిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (2), రజత్ పాటిదార్ (17), రవీంద్ర జడేజా (12), సర్ఫరాజ్ ఖాన్ (14), రవిచంద్రన అశ్విన్ (1) విఫలమయ్యారు.
ప్రస్తుతం చేతిలో మూడు వికెట్లు ఉన్న భారత్.. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 134 పరుగులు వెనుకబడి ఉంది. జురెల్‌తో పాటు కుల్దీప్ (72 బంతుల్లో 17 బ్యాటింగ్, ఒక ఫోర్) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో హార్ట్లీ రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 302/7తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ చివరకు 353 పరుగులకు ఆలౌటైంది. మాజీ కెప్టెన్ జో రూట్ (122 నాటౌట్) అజేయ శతకం బాదగా.. ఓలీ రాబిన్సన్ (58; 9 ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా పరుగులు రాబట్టాడు. చివరి మూడు వికెట్లు రవీంద్ర జడేజా ఖాతాలోకి వెళ్లాయి.
ఈ సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఒకే సిరీస్‌లో 600 పరుగులు చేసిన ఐదో భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టీమ్ఇండియా తరఫున గతంలోసునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, దిలీప్ సర్దేశాయ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇందులో సన్నీ, కోహ్లీ, ద్రవిడ్ రెండేసి సార్లు ఈ ఫీట్ సాధించారు.
గత టెస్టులో అంపైర్స్ కాల్ వల్ల నష్టపోయామని చెప్పిన ఇంగ్లండ్ సారథికి.. రాంచీ మ్యాచ్‌లో అదే వరమైంది. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు అంపైర్స్ కాల్ వల్ల పెవిలియన్ చేరారు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 353 (రూట్ 122 నాటౌట్, రాబిన్సన్ 58; జడేజా 4/67, ఆకాశ్‌దీప్ 3/83),
భారత్ తొలి ఇన్నింగ్స్: 219/7 (యశస్వి 73, గిల్ 38; బషీర్ 4/84, హార్ట్లీ 2/47).