భారత్, వెస్టిండీస్ కీలక పోరుకు సిద్ధమయ్యాయి. గెలిస్తే గానీ నిలువలేని పరిస్థితుల్లో టీమ్ఇండియా కొట్టుమిట్టాడుతుంటే..సుదీర్ఘ విరామం తర్వాత సిరీస్ గెలువాలన్న తలంపుతో విండీస్ కనిపిస్తున్నది. ఓవైపు టీమ్ఇండియాను పేలవ బ్యాటింగ్ కలవరపెడుతున్నది. ఇషాన్‌కిషన్, శుభ్‌మన్‌గిల్, సూర్యకుమార్ బ్యాట్లు ఝులిపించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. సొంతగడ్డపై ఈసారైనా ఒడిసిపట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న కరీబియన్లు రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ గెలువాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశముంది.
ప్రావిడెన్స్(గయానా): భారత్, వెస్టిండీస్ జట్లు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మరో పోరుకు సిద్ధమయ్యాయి. మంగళవారం ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ జరుగనుంది. సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న విండీస్ గెలుపు జోరు కొనసాగించాలని చూస్తుంటే..మరోవైపు వరుస ఓటములతో ఒత్తిడిమీద ఉన్న హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని టీమ్ఇండియా పుంజుకోవాలని చూస్తున్నది. స్లో పిచ్‌లపై పరుగులు సాధించడంలో ఇబ్బంది పడుతున్న టీమ్ఇండియా..విండీస్ బౌలర్లకు చెక్ పెట్టాలని చూస్తున్నది. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటింగ్..భారత్‌ను కలవరపెడుతున్నది.
వన్డేల్లో రాణించిన గిల్, ఇషాన్ కిషన్ ఫామ్ కొనసాగించడంలో విఫలమవుతున్నారు. వీరికి తోడు సూర్యకుమార్, శాంసన్, హార్దిక్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోతున్నారు. జట్టులోకి కొత్తగా వచ్చిన హైదరాబాదీ తిలక్‌వర్మ దూకుడుగా ఆడుతున్నాడు. అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ కరీబియన్లను దీటుగా ఎదుర్కొంటున్నాడు. బౌలింగ్‌లో ముకేశ్‌కుమార్ చివరి మ్యాచ్‌లో ధారళంగా పరుగులు సమర్పించుకోగా, అవేశ్‌ఖాన్, ఉమ్రాన్ మాలిక్లో ఎవరో ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. చాహల్‌కు తోడు గాయపడ్డ కుల్దీప్యాదవ్ తిరిగి జట్టులోకి రానున్నాడు. గెలుపు జోరు మీదున్న విండీస్ మార్పులేమి లేకుండానే బరిలోకి దిగనుంది.
జట్ల అంచనా
భారత్: హార్దిక్‌పాండ్యా(కెప్టెన్), గిల్, ఇషాన్‌కిషన్/జైస్వాల్, సూర్యకుమార్, తిలక్‌వర్మ, శాంసన్, అక్షర్‌పటేల్, కుల్దీప్యాదవ్, చాహల్, అర్ష్‌దీప్‌సింగ్, ముకేశ్ కుమార్.
వెస్టిండీస్: బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, చార్లెస్, పూరన్, హెట్‌మైర్, రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), హోల్డర్, షెఫర్డ్, హుసేన్, జోసెఫ్, మెక్కాయ్.