Ind Vs SL | కొలంబో: భారత్, శ్రీలంక వన్డే పోరుకు వేళయైంది. శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి మంచి జోరుమీదున్న టీమ్ఇండియా అదే ఊపులో లంకను వన్డేల్లో చిత్తుచేయాలని చూస్తున్నది. రానున్న చాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని జట్టులో మార్పులు, చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా వికెట్‌కీపర్, బ్యాటర్ విషయంలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ మధ్య పోటీ నెలకొన్నది. కెప్టెన్ రోహిత్, చీఫ్ కోచ్ గంభీర్ ఎవరికి ప్రాధాన్యమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. టీ20లకు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ తిరిగి జట్టులోకి రావడం టీమ్ఇండియాకు అదనపు బలం కానుంది. మరోవైపు కొత్త కెప్టెన్ చరిత అసలంక నేతృత్వంలో లంక బరిలోకి దిగనుంది. టీ20 సిరీస్ ఓటమికి వన్డేల్లోనైనా ప్రతీకారం తీర్చుకోవాలని లంక పట్టుదలతో కనిపిస్తున్నది.