India Vs South Africa | చెన్నై: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డేలు, ఏకైక టెస్టులో అదరగొట్టిన భారత మహిళల జట్టు టీ20లలో మాత్రం తేలిపోతోంది. చెన్నై వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో స్వల్ప తేడాతో ఓడిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన రెండో మ్యాచ్ వర్షార్పణం కావడంతో మంగళవారం ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో సఫారీలతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్ గోవిందా! వర్షం వల్ల రద్దు అయినా భారత్‌కు నిరాశే. ప్రధానంగా ఈ సిరీస్‌లో బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకుంటుండం భారత్‌ను తీవ్రంగా కలవరపెడుతున్నది.
గత రెండు మ్యాచ్‌లలో పూజా వస్త్రకార్, దీప్తిశర్మ మినహా మిగిలిన బౌలర్లంతా విఫలమయ్యారు. ఏస్ పేసర్ రేణుకాసింగ్ ఠాకూర్ తొలి మ్యాచ్‌లో ప్రభావం చూపకపోవడంతో రెండో టీ20లో ఆమె బెంచ్‌కే పరిమితమైంది. గత మ్యాచ్‌లో శ్రేయాంక పాటిల్ ఆకట్టుకోకపోగా రాధా యాదవ్ రెండు మ్యాచ్‌లలోనూ భారీగా పరుగులు సమర్పించుకుంది. బౌలర్ల వైఫల్యంతో తొలి మ్యాచ్‌లో 189 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా వర్షం వల్ల రైద్దెన రెండో టీ20లోనూ 177 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది.
బ్యాటింగ్‌లో భారత్‌కు స్మృతి మంధాన ఫామ్‌లో ఉండటం కలిసొచ్చేదే కాగా తొలి మ్యాచ్‌లో విఫలమైన షఫాలీ వర్మ భారీ ఇన్నింగ్స్ బాకీపడి ఉంది. హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్ టచ్‌లోనే ఉన్నారు. హేమలత, యువ వికెట్ కీపర్ ఉమా ఛెత్రి చెలరేగాలని భారత్ భావిస్తోంది. మరోవైపు సఫారీ బ్యాటర్లలో బ్రిట్స్, కెప్టెన్ వోల్వార్ట్, మరిజన్నె కాప్, అన్నెకి బోష్ గత రెండు మ్యాచ్‌లలోనూ మెరుపులు మెరిపించారు. మరి మంగళవారం జరుగబోయే కీలక పోరులో అయినా మన బౌలర్లు సఫారీ బ్యాటర్ల జోరును ఏ మేరకు అడ్డుకుంటారనేది ఆసక్తికరం.