విశాఖపట్నం: స్వదేశంలో భారత క్రికెట్ జట్టు మరో ఆసక్తికర సమరానికి సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1-1తో సమంగా ఉండగా శనివారం సాగరతీర నగరం విశాఖపట్నం వేదికగా టీమ్ఇండియా.. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో మ్యాచ్‌లో తలపడబోతున్నది. రాంచీలో అదరగొట్టి రాయ్‌పూర్‌లో అదృష్టం వెక్కిరించడంతో అపజయం వైపు నిలిచిన మెన్ ఇన్ బ్లూ.. టెస్టు సిరీస్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది.
మరోవైపు సౌతాఫ్రికా మాత్రం.. టెస్టు సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌నూ గెలుచుకుని 40 ఏండ్లుగా భారత గడ్డపై విదేశీ జట్లు సాధించలేని ఘనతను అందుకోవడానికి ఒకే ఒక విజయం దూరంలో నిలిచింది.
భారత్‌లో టాస్ అత్యంత కీలకం. మరీ ముఖ్యంగా శీతాకాలంలో మంచు ప్రభావం తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో.. జట్ల గెలుపోటములు నిర్దేశించే టాస్ గెలవడంలో టీమ్ఇండియాను అదృష్టం దారుణంగా వెక్కిరిస్తున్నది. భారత జట్టు వన్డేల్లో చివరిసారిగా టాస్ గెలిచి దాదాపు రెండేండ్లు గడిచిపోయింది.