ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లకు (ఏ ఫార్మాట్లో అయినా) ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనధికారికంగా అది తుపాకులు, తూటాలు లేని సమరం. అభిమానులకది మైదానంలో ఇరుజట్ల నుంచి 11 మంది ఆయుధాలు లేని సైనికులు బంతి, బ్యాట్‌తో హోరాహోరీగా పోరాడే రణక్షేత్రం. రెండు జట్ల నుంచి దిగ్గజ ఆటగాళ్లెందరో ఈ సమరాన్ని తమదైన ఆటతో రక్తికట్టించి నరాలు తెగే ఉత్కంఠతో కూడిన ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లను క్రికెట్ ప్రేక్షకులకు అందించారు. దాయాదుల పోరు అంటే టీవీలకు అతుక్కుపోని క్రికెట్ అభిమాని ఉండడు అనేది అతిశయోక్తేం కాదు. క్రికెట్లో ‘గ్రేటెస్ట్ రైవల్రీ’ అని ఈ రెండు జట్లు ఆడే మ్యాచ్‌లకు పేరుంది. కానీ ఇదంతా నిన్నటి మాట. కొన్నేండ్లుగా వార్ వన్‌సైడే అవుతున్నది. తాజాగా భారత టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ అయితే ‘ఇకనుంచి ఆ జట్టును ‘ప్రత్యర్థి’ అనొద్దు’ అని చెప్పడం చర్చనీయాంశమైంది.
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4 దశలో ఆదివారం (సెప్టెంబర్ 21) పాకిస్థాన్‌తో మ్యాచ్ ముగిశాక పాత్రికేయులతో సూర్య మాట్లాడుతూ.. ‘మీరు ఇకనుంచి పాకిస్థాన్‌తో మాకు జరిగే మ్యాచ్‌లకు ప్రత్యర్థి అనే పదం వాడొద్దు. నా వరకైతే రెండు జట్లు ఒక 15 మ్యాచ్‌లు ఆడాయని అనుకుందాం. అందులో ఇరు జట్లు 7-7తో సమంగా ఉంటేనో లేక 8-7తో ఉంటేనో వాళ్లు మెరుగైన క్రికెట్ ఆడారని అనుకోవచ్చు. కానీ 13-0, 10-1తో ఉంటే అది ఎంతమాత్రమూ మీరంటున్న వైరం కాదు’ అని చెప్పాడు. సూర్య చెప్పింది అక్షర సత్యం. గణాంకాలను చూస్తే పాక్‌పై భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. సరిహద్దు సమస్యలతో ఇరుజట్ల మధ్య 2012 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు లేనందున ఐసీసీ, ఆసియా కప్ వంటి ఈవెంట్స్‌లో మాత్రమే భారత్, పాక్ తలపడుతున్నాయి. వాటిలో ఒకటి అరా తప్ప వార్ వన్‌సైడే.
వన్డే ప్రపంచకప్‌లో ఇరుజట్లు 8 సార్లు తలపడితే ఎనిమిదింటిలోనూ భారత్‌దే విజయం. టీ20 ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌లు ఆడితే భారత్ 6 గెలవగా పాకిస్థాన్ ఒకటి గెలవగా ఒక మ్యాచ్ డ్రా అయింది. చాంపియన్స్ ట్రోఫీలో ఆరు మ్యాచ్‌లు ఆడితే దాయాదులు తలా 3 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించారు. 2007 నుంచి టీ20లలో 15 సార్లు తలపడితే టీమ్ఇండియా ఏకంగా 12 సార్లు గెలువగా పాక్ నెగ్గింది రెండే.
మియందాద్ కుప్పిగంతుల నుంచి కోహ్లీ సిక్సర్ వరకూ..
టెస్టుల్లో 1952 నుంచి దాయాదులు తలపడుతున్నా వన్డేల్లో 1978 నుంచి మొదలయ్యాయి. వన్డే ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థులు ముఖాముఖి తలపడుతున్నది 1987 నుంచే.. 1992 వన్డే వరల్డ్ కప్‌లో ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ కిరణ్ మోరే శ్రుతి మించి అప్పీల్ చేస్తున్నాడని అతడిని వెక్కిరిస్తూ జావేద్ మియాందాద్ కుప్పిగంతులు వేయడం అభిమానులకు ఇప్పటికీ గుర్తే. 1996 ప్రపంచకప్ క్వార్టర్స్‌లో భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్‌ను పాక్ బ్యాటర్ అమీర్ సొహైల్ కవ్వించడం.. 1986లో జావేద్ మియందాద్ ఆస్ట్రల్ ఆసియా కప్‌లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టడం..
2003 వన్డే ప్రపంచకప్‌లో వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయభ్ అక్తర్ వంటి పేసర్లను చీల్చి చెండాడుతూ సచిన్ 98 పరుగుల ఇన్నింగ్స్.. 2010లో ఆసియా కప్‌లో ఆఖరి ఓవర్లో హర్భజన్ సిక్సర్.. ఇవన్నీ ఒకెత్తుఅయితే 2007 టీ20 ప్రపంచకప్ సమరం మరో ఎత్తు. గ్రూప్ స్టేజ్‌లో బాల్ అవుట్ ద్వారా ఫలితం తేలడం.. ఫైనల్లో మిస్బావుల్ హక్ ఇచ్చిన క్యాచ్‌ను శ్రీశాంత్ అందుకోవడం.. వంటి ఎన్నో మ్యాచ్‌లు దాయాదుల పోరుకు మరింత వన్నె తీసుకొచ్చాయి. 2022లో మెల్బోర్న్ వేదికగా విరాట్ కోహ్లీ (82*) చేసిన ఒంటరిపోరాటం మరో ఎత్తు. హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో కొట్టిన రెండు సిక్సర్లు భారత అభిమానులెవరూ మరిచిపోరు.
కానీ 2023 వన్డే ప్రపంచకప్, 2024 టీ20 ప్రపంచకప్‌తో ఈ ఏడాది ముగిసిన చాంపియన్స్ ట్రోఫీతో పాటు తాజాగా ఆసియా కప్‌లోనూ పాక్ ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. పాక్ ప్రదర్శనపై ఆ జట్టు సీనియర్లు అక్రమ్, అక్తర్ వంటివారయితే బహిరంగంగానే పాక్ ఆటగాళ్ల ఆటతీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గతంతో పోల్చితే పాకిస్థాన్ జట్టు బలహీనంగా తయారైంది. పాక్‌కు బౌలింగే బలం. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్, అక్తర్ వంటి హేమాహేమి పేసర్లను అందించిన పాక్‌కు ఇప్పడు ఆ స్థాయి బౌలర్ లేడు. షహీన్ షా అఫ్రిది ఆరంభంలో ఆ కొరతను తీర్చుతాడని అనుకున్నా గత రెండేండ్లుగా అతడి ప్రదర్శన నానాటికీ దిగజారుతున్నది. రౌఫ్ ఎప్పుడు జట్టులో ఉంటాడో తెలియని పరిస్థితి. నిత్యం హెడ్‌కోచ్‌ల మార్పు, జట్టులో బంధుప్రీతి, స్టార్ ఆటగాళ్ల నిలకడలేనితనంతో పాటు దేశవాళీ క్రికెట్‌ను గాలికొదిలేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్వహణ వైఫల్యం వంటివి ఆ జట్టుకు శాపంగా మారాయి. ఒకవైపు టీమ్ఇండియా.. ఐపీఎల్, స్థానికంగా క్రికెట్ లీగ్‌లు, దేశవాళీలో సౌకర్యాలను మెరుగుపరుచుకుని యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతుంటే పాక్ మాత్రం ఆ దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లాగే అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్నది.