కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. క్రికెట్‌ను మతంలా భావించే భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధానికి సమయం ఆసన్నమైంది. ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా దాయాదులు సై అంటే సై అనబోతున్నారు. విజయమో, వీరస్వర్గమో అన్న రీతిలో సరిహద్దుల్లో సైనికుల్లాగా కదంతొక్కనున్నారు. బంగ్లాదేశ్‌పై భారీ విజయంతో టీమ్ఇండియా మంచి జోష్మీదుంటే..న్యూజిలాండ్‌పై అనూహ్య ఓటమితో పాక్ చావోరేవో ఎదుర్కొంటున్నది. సరిగ్గా ఏడేండ్ల క్రితం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తమకు ఎదురైన ఓటమికి ప్రతీకారం కోసం భారత్ చూస్తుంటే..ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ఆతిథ్య హోదాలో పరువు కాపాడుకోవాలని పాక్ పట్టుదలతో ఉంది. మొత్తంగా ప్రపంచ అత్యుత్తమ జట్ల మధ్య పోరులో ఎవరిది పైచేయి అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.
India vs Pakistan | దుబాయ్: భారత్, పాకిస్థాన్ జట్లు క్రికెట్ కదనరంగంలో కలబడబోతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూపు-ఏలో ఆదివారం భారత్, పాక్ మధ్య కీలక పోరు జరుగనుంది. మెగాటోర్నీలో మరింత ముందంజ వేయాలంటే తప్పక గెలువాల్సిన పరిస్థితిలో ఇరు జట్లు ఈ పోరును మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి బోణీ కొట్టిన టీమ్ఇండియా అదే జోరులో పాక్ పని పట్టి సెమీఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని చూస్తున్నది. మరోవైపు సొంతగడ్డపై చాలా ఏండ్ల తర్వాత ఐసీసీ టోర్నీ ఆడుతున్న పాక్ పరువు కోసం పాకులాడుతున్నది. తమ తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో చావుదెబ్బతిన్న పాక్‌కు భారత్ పోరు చాలా కీలకమైంది. మెగాటోర్నీలో నిలువాలంటే తప్పక గెలువాల్సిన పరిస్థితిని పాక్ ఎదుర్కొంటున్నది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దయిన వేళ ఐసీసీ టోర్నీలో భారత్, పాక్ పోరు కోట్లాది అభిమానులను అలరించబోతున్నది.
భారత్ జోరు: రోహిత్‌శర్మ నేతృత్వంలోని భారత్ వరుస విజయాలతో జోరు మీద ఉన్నది. మెగాటోర్నీకి ముందు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ఇండియా..చాంపియన్స్ ట్రోఫీపై కన్నేసింది. చివరిసారి 2013లో ట్రోఫీ గెలిచిన టీమ్ఇండియాకు 2017లో పాక్ చెక్ పెట్టింది. అనాడు లండన్‌లో ఎదురైన ఓటమికి ఈనాడు దుబాయ్‌లో ప్రతీకారం తీర్చుకునేందుకు టీమ్ఇండియాకు సమయం ఆసన్నమైంది. శుభ్‌మన్ గిల్, రోహిత్‌శర్మ సూపర్ఫామ్మీదుండటం మనకు బాగా కలిసిరానుంది. బంగ్లాతో మ్యాచ్‌లో సహచరులు విఫలమైన చోట తాను ఉన్నానంటూ గిల్ బాధ్యతాయుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. స్టార్ బ్యాటర్ కోహ్లీ ఫామ్ ఒకింత కలవరపెడుతున్నా..పాక్‌తో పోరు అంటే విరాట్ విశ్వరూపం ప్రదర్శించడం అనవాయితీగా వస్తున్నది. బుమ్రా లేకపోవడం భారత్‌కు లోటు అయినా షమీ ఫామ్‌లోకి రావడం కలిసొచ్చేది. షమీకి తోడు హర్షిత్ రానా, అర్ష్‌దీప్‌సింగ్, హార్దిక్ పాండ్యా జతకలిస్తే భారత్‌కు తిరుగుండదు. కుల్దీప్, అక్షర్, జడేజా స్పిన్ తంత్రం పారితే పాక్‌కు కష్టాలు ఎదురైనట్లే. బంగ్లాతో బరిలోకి దిగిన జట్టునే పాక్‌తో మ్యాచ్‌లో కొనసాగించే అవకాశముంది.
జట్ల అంచనా: భారత్: రోహిత్(కెప్టెన్), గిల్, కోహ్లీ, అయ్యర్, రాహుల్, హార్దిక్, జడేజా, అక్షర్, రానా, షమీ, కుల్దీప్యాదవ్ పాకిస్థాన్: ఇమాముల్, బాబర్ ఆజమ్, షకీల్, రిజ్వాన్(కెప్టెన్), సల్మాన్ ఆగా, తాహిర్, కుష్దిల్ షా, అఫ్రీది, నసీమ్షా, రవూఫ్, అబ్రార్ అహ్మద్.
పాక్ పరువు కోసం:
మెగాటోర్నీలో నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన స్థితిని పాక్ ఎదుర్కొంటున్నది. కివీస్ చేతిలో ఓటమితో మెగాటోర్నీని మొదలుపెట్టిన పాక్‌కు భారత్ చేతిలోనూ ఓటమి ఎదురైతే దారులు దాదాపు మూసుకుపోయినట్లే. దీనికి తోడు ఫకర్ జమాన్ రూపంలో పాక్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కివీస్‌తో మ్యాచ్‌లో గాయపడ్డ జమాన్..టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. జమాన్ స్థానంలో ఇమాముల్ హక్ జట్టులోకి వచ్చాడు. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కివీస్‌పై చెత్త బ్యాటింగ్ బాబర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అఫ్రీది, నసీమ్షా, రవూఫ్‌తో పాక్ పేస్ దళం బలంగాఉన్నా..బ్యాటింగ్‌లో నిలకడలేమి ఆ జట్టును వేధిస్తున్నది.