T20 World Cup | మొదటిసారి ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో ఆడే అవకాశంతో పాటు ఆతిథ్య హక్కులను పొందిన అమెరికా. దానికి ఆనుకుని ఉన్న కెనడా. పై రెండు దేశాల మాదిరిగానే సరిహద్దులు పంచుకుంటున్న దాయాదులు భారత్, పాకిస్థాన్. తమదైన రోజున సంచలనాలు నమోదుచేసేందుకు సిద్ధమైన ఐర్లాండ్. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్- ఏలో ఐదు జట్లు ఉన్నప్పటికీ అందరి కండ్లు జూన్ 9న జరుగబోయే దాయాదుల పోరు మీదే!
తొలిసారి ఐసీసీ ట్రోఫీ బరిలో నిలిచిన అమెరికాపై అంచనాలు లేకపోయినప్పటికీ గ్రూప్ దశలో ఒక్క విజయం నమోదు చేసినా, ప్రత్యర్థులకు కనీసం పోటీనిచ్చినా అది ఆ జట్టుతో పాటు అగ్రరాజ్యాన క్రికెట్‌కూ మంచి చేసేదే. ఇటీవలే 2-1తో బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నెగ్గడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కోరె అండర్సన్, నిసర్గ పటేల్, స్టీవెన్ టేలర్ వంటి స్టార్లు ఉన్న అమెరికా.. సొంత ప్రేక్షకుల నడుమ ప్రత్యర్థులకు పోటీనివ్వాలని తహతహలాడుతోంది.
2011 వన్డే వరల్డ్ కప్‌లో ఆడిన అనుభవం ఉన్న కెనడాకు ఇదే మొదటి పొట్టి ప్రపంచకప్. ఈ జట్టులోనూ ‘వలస క్రికెటర్లు’ లెక్కకుమించే ఉన్నారు. అదీగాక అందరూ ‘థర్టీ ప్లస్’ బాపతే. ప్రత్యర్థి జట్లు తమపై భారీ స్కోరు కొట్టకుండా కాపాడుకోగలిగితే అదే పదివేలు.
ఏడోసారి ఈ టోర్నీలో ఆడుతున్న ఐర్లాండ్ గత కొన్నాళ్లుగా బాగా మెరుగయ్యింది. ఫ్రాంచైజీ క్రికెట్ పుణ్యమా అని ఆ జట్టు ఆటగాళ్లు లీగ్‌లలో ఇరగదీస్తున్నారు. అనుభవజ్ఞుడైన పాల్ స్టిర్లింగ్ సారథ్యంలో.. హ్యారీ టెక్టర్, లొర్కన్ టక్కర్, రాస్ అడైర్, కర్టిస్ కంఫర్ వంటి బ్యాటర్లతో ఆ జట్టు బలంగానే ఉంది. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడే జోషువా లిటిల్, మార్క్ అడైర్ ఇప్పటికే తామేమిటో నిరూపించుకున్నారు. ఏదైనా సంచలనం నమోదైతే ఐర్లాండ్.. సూపర్-8కు వచ్చినా ఆశ్చర్యపోనక్లర్లేదు.
అస్థిరతకు మారుపేరైన పాకిస్థాన్ మరోసారి ఐసీసీ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2009లో విజేతగా నిలిచిన పాక్.. వన్డే ప్రపంచకప్ తర్వాత వద్దనుకున్న బాబర్ ఆజమ్ సారథ్యంలోనే మళ్లీ బరిలోకి దిగుతోంది. భారత్‌కు వన్డే వరల్డ్ కప్ అందించిన గ్యారీ కిర్‌స్టెన్‌పై ఆ జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. రిజ్వాన్, బాబర్, ఫకర్, ఇఫ్తికార్, ఇమాద్ వసీం వంటి అనుభవజ్ఞులైన బ్యాటర్లు ఉన్నా కీలక మ్యాచ్‌లలో వీళ్లు ఏ మేరకు రాణిస్తారనేదే ప్రశ్నార్థకం. పాక్ బ్యాటింగ్ కంటే బౌలింగ్ దళం దుర్బేధ్యంగా ఉంది. షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్‌తో పాటు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగొచ్చిన మహ్మద్ అమీర్ ఆ జట్టుకు కీలకం. 2021లో సెమీస్, 2022లో ఫైనల్ చేరిన ఆ జట్టు ఈసారైనా 2009ని పునరావృతం చేయాలని భావిస్తోంది. సెమీస్ చేరడం కష్టమేమీ కాకున్నా భారత్‌తో మ్యాచ్‌లో ఎలా ఆడతారన్నది కీలకం.
ఈ గ్రూప్‌తో పాటు టోర్నీలోనూ ‘టైటిల్ ఫేవరేట్’గా ఉన్న భారత క్రికెట్ జట్టు.. 11 ఏండ్ల ఐసీసీ ట్రోఫీ కరువును పారదోలేందుకు మరో అవకాశం. 2022 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ ఓటమి, 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ పరాభవాన్ని మరిచిపోయి ఈ ఏడాది కప్పుకొట్టాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతోంది. ఏదైనా ‘మహాద్భుతం’ జరిగితే తప్ప టీమ్ఇండియా సెమీస్ బెర్తు దాదాపు ఖాయమైనట్టే. అనుభవజులు, యువకులతో కలగలిసిన ‘మెన్ ఇన్ బ్లూ’కు గ్రూప్-ఏలో అంతో ఇంతో పోటీనిచ్చే జట్టు ఏదైనా ఉందంటే అది బాబర్ సేన మాత్రమే. ఐసీసీ టోర్నీలలో పాక్‌పై భారత్‌కు మంచి రికార్డు ఉండటం మనకు కలిసొచ్చేదే అయినప్పటికీ బంతిని రెండువైపులా స్వింగ్ చేసే అమిర్, అఫ్రిది, నసీమ్ వంటి పేసర్లు ఉండటం మన బ్యాటర్లకు సవాలే. రోహిత్, కోహ్లీ, జైస్వాల్, సూర్యకుమార్, పంత్, శివమ్ దూబే వంటి బ్యాటర్లు.. చాహల్, కుల్దీప్ రూపంలో బంతిని గింగిరాలు తిప్పే స్పిన్నర్లు.. జడేజా, హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్లు భారత్ సొంతం. పేసర్లలో బుమ్రాకు తోడుగా అర్ష్‌దీప్, సిరాజ్ రాణిస్తే రోహిత్ సేనకు ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు.