అనంతపూర్: దులీప్ ట్రోఫీలో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. దేశవాళీలో సత్తాచాటి జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్న ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఇండియా-‘డీ’తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ‘ఏ’ బ్యాటర్లు హైదరాబాదీ తిలక్‌వర్మ(193 బంతుల్లో 111 నాటౌట్, 9ఫోర్లు), ఓపెనర్ ప్రథమ్‌సింగ్(189 బంతుల్లో 122, 12ఫోర్లు, సిక్స్) సూపర్ సెంచరీలతో కదంతొక్కారు. వీరిద్దరి విజృంభణతో ఇండియా ‘ఏ’ రెండో ఇన్నింగ్స్‌లో 380/3 వద్ద డిక్లేర్ చేసింది. తిలక్, ప్రథమ్ కలిసి రెండో వికెట్‌కు 104 పరుగులు జోడించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా ‘డీ’ వికెట్ కోల్పోయి 62 పరుగులు చేసింది. రికీ భుయ్(44), యశ్ దూబే(15) క్రీజులో ఉన్నారు.
ఆదుకున్న అభిమన్యు: ఇండియా ‘సీ’తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ‘బీ’ ఎదురీదుతున్నది. సహచరులు విఫలమైన చోట కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(143 నాటౌట్) అజేయ సెంచరీతో ఆదుకున్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 124తో మూడో రోజు ఆట కొనసాగించిన ఇండియా‘బీ’ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ముషీర్‌ఖాన్ (1), సర్ఫరాజ్‌ఖాన్(16), రిం కూసింగ్ (6), నితీశ్‌కుమార్‌రెడ్డి(2), సుందర్ (13) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అయినా వెనుకకు తగ్గని ఈశ్వరన్..జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. చేతిలో మూడు వికెట్లు ఉన్న ఇండియా ‘బీ’ 216 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నది.