లక్నో: సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (210 బంతుల్లో 176 నాటౌట్, 16 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ శతకానికి తోడు సాయి సుదర్శన్ (100) సెంచరీతో కదంతొక్కడంతో ఆస్ట్రేలియా ‘ఏ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఏ’ రికార్డు విజయాన్ని అందుకుంది. 413 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు గాను ఓవర్‌నైట్ స్కోరు 169/2తో నాలుగో రోజు ఆట ఆరంభించిన భారత్.. 91.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదనను పూర్తిచేసింది.
సాయి నిష్క్రమించాక కెప్టెన్ ధ్రువ్ జురెల్ (56), నితీశ్ రెడ్డి (16*)తో కలిసి రాహుల్ గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశాడు. కాగా భారత్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇది విజయవంతమైన ఆరో అత్యధిక చేధన. ఈ జాబితాలో వెస్ట్‌జోన్.. 2010 దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్ నిర్దేశించిన 536 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడమే ఇప్పటిదాకా అత్యుత్తమంగా ఉంది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-0తో గెలుచుకుంది.