IND W Vs IRE W | రాజ్‌కోట్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. ఇప్పటి వరకు వన్డేల్లో భారత్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే. ఇంతకు ముందు 2017లో వడోదరలో ఇర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. మహిళల వన్డేల్లో 15వ అత్యధిక స్కోరు కావడం విశేషం. మహిళల వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. 2018లో డబ్లిన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 491 పరుగులు చేసింది. వన్డేల్లో ఇప్పటి వరకు న్యూజిలాండ్ ఇప్పటి వరకు నాలుగు సార్లు అత్యధిక స్కోర్ సాధించింది.
ఇక ఐర్లాండ్‌తో జరిగిన వన్డేలో కెప్టెన్ స్మృతి మంధాన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మంధాన, ప్రతీక జోడి టీమిండియాకు మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 156 పరుగులు జోడించారు. మంధాన 54 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 73 పరుగులు, ప్రతీక 61 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 67 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆ తర్వాత హర్లీన్ డియోల్ కూడా అర్ధ సెంచరీ చేసింది. ఆమె 84 బంతుల్లో 12 ఫోర్లతో 89 పరుగులు చేసింది. జెమీమా 91 బంతుల్లో 12 ఫోర్లతో 102 పరుగులు చేసింది. అంతర్జాతీయ క్రికెట్ మహిళల వన్డేలో జెమీమాకు ఇది తొలి సెంచరీ. రిచా ఘోష్ ఐదు బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యింది. తేజల్ హసబ్నిస్, సయాలి సత్ఘారే చెరో రెండు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఐర్లాండ్ తరఫున ఓర్లా ప్రెండర్‌గాస్ట్, అర్లీన్ కెల్లీ చెరో రెండు వికెట్లు, జార్జినా డెంప్సేకు ఒక వికెట్ దక్కింది.