యువపేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. రెండో వన్డేలో విండీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. బ్రాండన్ కింగ్ (18), డారెన్ బ్రావో (1)ను స్వల్పస్కోర్లకే పెవిలియన్ చేర్చిన అతను.. కెప్టెన్ నికొలస్ పూరన్ (9)ను కూడా వెనక్కు పంపాడు. ఇన్నింగ్స్ 20వ ఓవర్లో బంతి అందుకున్న కృష్ణ.. అటు షార్ట్ పిచ్ కాదు, ఇటు గుడ్ లెంగ్త్ కాదు అనేలా బంతిని డెలివర్ చేశాడు. దీంతో ఎలాగైనా బంతిని బాదాలనుకున్న పూరన్ ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతిని వైడ్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ అందుకున్నాడు. దీంతో పూరన్ కథ ముగిసింది. 66 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన విండీస్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో బ్రూక్స్, హోల్డర్ ఉన్నారు. వీళ్లిద్దరి మీదనే విండీస్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి కృష్ణ వీరి భరతం కూడా పడతాడేమో చూడాలి.