సఫారీ టూర్లో నిరుత్సాహ పరిచిన టీమిండియా.. విండీస్‌తో జరిగే సిరీస్‌లో విజయంతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తోంది. సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ కోల్పోయిన జట్టు.. మూడు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. ఆ అవమానాన్ని విండీస్‌పై విజయంతో కడిగేసుకోవాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా భావిస్తోంది.
అయితే భారత జట్టును ముగ్గురు విండీస్ ఆటగాళ్లు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ పుణ్యమా అని విండీస్ ఆటగాళ్లలో చాలా మందికి భారతదేశ పరిస్థితులు కొట్టిన పిండి. ఇక్కడ వాళ్లకు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే. ఈ క్రమంలో భారత జట్టుకు సమస్యగా మారే అవకాశం ఉన్న విండీస్ ఆటగాళ్ల వివరాలు చూద్దామా?
ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడే ఈ ఓపెనర్.. వన్డేల్లో వెస్టిండీస్ జట్టులో చాలా కీలకమైన ఆటగాడు. ఇప్పటి వరకు 86 వన్డేల్లో 52 సగటుతో 3698 పరుగులు చేశాడు. ముఖ్యంగా తొలి పవర్ ప్లేలో బౌలర్లకు చుక్కలు చూపించడం హోప్ ప్రత్యేకత.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. భారత బౌలర్లు చాలా కాలంగా తొలి పవర్ ప్లేలో వికెట్లు తీయడానికి నానాతిప్పలూ పడుతున్నారు. అప్పటికీ అడపా దడపా తప్పితే ఎక్కువగా ఫలితం రాబట్టలేకపోయారు. అందుకే భారత్‌కు హోప్ అతిపెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను కూడా హోప్ సమర్ధవంతంగా ఎదుర్కోగలడు. మరి ఇతన్ని భారత బౌలర్లు ఎలా అడ్డుకుంటారో మరి.
గతేడాది విండీస్ క్రికెట్‌కు లభించిన మట్టిలో మాణిక్యం అకీల్ హొసేన్. గత జనవరిలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ ఎడమ చేతి వాటం స్పిన్నర్.. అప్పటి నుంచి తనకు తాను పదును పెట్టుకుంటూ ఎదుగుతున్నాడు. ఐపీఎల్ 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నెట్ బౌలర్‌గా కూడా మారాడు.
ఇప్పటి వరకూ విండీస్ తరఫున 12 వన్డేలు ఆడిన అతను 20 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ ఒక్కటే కాదు, లోయర్ ఆర్డర్లో భారీ షాట్లు ఆడుతూ బ్యాటుతోనూ జట్టుకు సహాయపడగల సత్తా అకీల్ సొంతం.
భారత క్రీడాభిమానులకు కూడా ఈ పేరు సుపరిచితమే. గతేడాది పంజాబ్ కింగ్స్ తరఫున పేలవ ప్రదర్శన చేసినప్పటికీ.. పూరన్ ట్యాలెంట్‌పై ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. గత టీ20 ప్రపంచకప్‌లో కూడా పూరన్ నిరాశపరిచాడు. కానీ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచుల్లో కొన్ని మంచి ఇన్నింగ్సులు ఆడాడు. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచులు గెలిపించే సత్తా పూరన్ సొంతం.
బాగా తెలిసిన భారత వాతావరణంలో గనుక పూరన్ తన పూర్వ ఫామ్ అందుకుంటే.. భారత జట్టుకు గెలుపు అవకాశాలు తగ్గించే సత్తా ఈ విండీస్ క్రికెటర్‌కు ఉంది. ఇప్పటి వరకు 34 మ్యాచ్‌లు ఆడిన పూరన్..42 సగటుతో 1060 పరుగులు చేశాడు. వీటిలో అతని స్ట్రయిక్ రేట్ 100 ఉందంటే అతను ఎంత డీసెంట్‌గా బ్యాటింగ్ చేశాడో తెలిసిపోతుంది.