IND vs SL: నెలన్నర క్రితం భారత్ – శ్రీలంక మధ్య కొలంబో వేదికగా ముగిసిన ఆసియా కప్ ఫైనల్ గుర్తుందా..? హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మహ్మద్ సిరాజ్ దెబ్బకు శ్రీలంక 50 పరుగులు చేయడానికి నానా తంటాలు పడింది. ఆ మ్యాచ్‌లో ఏడు ఓవర్లు వేసిన సిరాజ్.. ఆరు వికెట్లు పడగొట్టి లంక వెన్ను విరిచాడు. తాజాగా అదే సీన్ ముంబైలో రిపీట్ అయ్యింది. 358 పరుగుల ఛేదనలో శ్రీలంక.. కనీసం పోటీకూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక.. 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయి 302 పరగుల తేడాతో ఓడిపోయింది. మహ్మద్ సిరాజ్, షమీ, బుమ్రాలు నిప్పులు చెరిగి లంకను కోలుకోనీయలేదు. ఈ విజయంతో ప్రపంచకప్‌లో భారత్ అపజయం అన్నదే లేని జట్టుగా నిలిచింది. ఏడింటికి ఏడూ గెలిచిన భారత్.. సెమీఫైనల్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టు.
లంక బ్యాటర్లలో ఏంజెలో మాథ్యూస్ (12), మహీశ్ తీక్షణ (12 నాటౌట్), కసున్ రజిత (14)లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగా రజిత టాప్ స్కోరర్. ఆ జట్టులో ఏకంగా ఐదుగురు డకౌట్ కాగా ముగ్గురు సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయ్యారు.
నిప్పులు చెరిగిన భారత పేస్ త్రయం
బ్యాటింగ్‌కు స్వర్గధామమైన వాంఖెడేలో భారత పేస్ త్రయం జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీల ధాటికి లంక విలవిల్లాడింది. స్కోరుబోర్డుపై పరుగులేమీ చేరకుండానే తొలి వికెట్ కోల్పోయిన లంక.. ఇంకా కోలుకోలేదు. బుమ్రా ఇచ్చిన ఆరంభాన్ని సిరాజ్ కొనసాగించాడు. తొలి బంతికే బుమ్రా.. కుశాల్ మెండిస్‌ను వికెట్ల ముందు దొరికిపోయాడు. సిరాజ్ రెండో ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన.. తన తర్వాత ఓవర్లో మరో వికెట్ తీశాడు. రెండో ఓవర్లోనే తొలి బంతికి కరుణరత్నె.. ఐదో బంతికి సమరవిక్రమ నిష్క్రమించాడు. ఈ ముగ్గురూ సున్నాలు చుట్టారు. సిరాజ్ తన మరుసటి ఓవర్లో.. కెప్టెన్ కుశాల్ మెండిస్ (1)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
షమీ అన్‌స్టాపబుల్
3.1 ఓవర్లో నాలుగో వికెట్ కోల్పోయిన లంక.. 9.2వ ఓవర్ వరకూ కాస్త వికెట్ పడకుండా అడ్డుకోగలిగింది. 24 బంతులాడిన చరిత్ అసలంక ఒక్క పరుగే చేశాడు. ఏంజెలా మాథ్యూస్ .. 25 బంతులాడి 12 పరుగులు చేశాడు. లంక తరఫున తొలి బౌండరీని సాధించాడు. ఐదు ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న మాథ్యూస్ – అసలంకల జోడీ ఐదో వికెట్‌కు 11 పరుగులు జోడించింది. ఈ జోడీని షమీ విడదీసి లంకను కోలుకోనీయకుండా చేశాడు. తాను వేసిన తొలి ఓవర్లోనే పదో ఓవర్లో లంకకు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో అసలంక, హేమంతలను ఔట్ చేశాడు. 12వ ఓవర్లో షమీ.. చమీరను ఔట్ చేయగా.. 14వ ఓవర్లో మాథ్యూస్ కూడా నిష్క్రమించాడు. 14 ఓవర్లలో లంక స్కోరు.. 36-8 మాత్రమే. ఈ దశలో అసలు లంక 50 పరుగులైనా చేస్తుందా..? అన్న అనుమానం కలిగింది. కానీ ఆఖర్లో తీక్షణ, రజితలు తొమ్మిదో వికెట్‌కు 20 పరుగులు జోడించడంతో ఆ జట్టు అతికష్టమ్మీద 50 రన్స్ చేయగలిగింది. భారత బౌలర్లలో షమీ మరోసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టగా సిరాజ్ మూడు వికెట్లు తీశాడు. బుమ్రా, జడేజాలకు తలా ఓ వికెట్ దక్కింది.