వాండరర్స్ టెస్టులో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న హనుమ విహారి (20) పెవిలియన్ చేరాడు. రబాడ వేసిన బంతి కొంత ఎక్స్ట్రా బౌన్స్ అయింది. దాన్ని కిందకు నెట్టేందుకు విహారి ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. దీంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి షార్ట్ లెగ్ దిశగా వెళ్లింది.
ఎడమచేతి వైపు అద్భుతంగా జంప్ చేసిన రాసీ వాన్ డర్ డస్సెన్ చక్కగా క్యాచ్ అందుకోవడంతో విహారి ఇన్నింగ్స్ ముగిసింది. విహారి కన్నా ముందు వచ్చిన పుజారా (3), రహానే (0) తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. కోహ్లీ గైర్హాజరీలో జట్టుకు తొలిసారి నాయకత్వం వహిస్తున్న కేఎల్ రాహుల్ (42 నాటౌట్) ఒక్కడే పోరాడుతున్నాడు.
మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (26) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు. విహారి అవుటవడంతో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. సఫారీ బౌలర్లలో డువానె ఆలివర్ రెండు వికెట్లు పడగొట్టగా, వెటరన్ పేసర్ కగిసో రబాడ ఒక వికెట్ తీసుకున్నాడు.