Sunil Gavaskar | భారత టెస్ట్ క్రికెట్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. గతేడాది న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ చేసిన విషం తెలిసిందే. తాజాగా దక్షిణాఫ్రికాపై 2-0 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. ఈ క్రమంలో టీమిండియా, హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. టెస్ట్ సిరీస్‌లలో ప్రత్యర్థి జట్లు భారత్ కంటే మెరుగ్గా కష్టపడ్డాయని.. ఫలితంగా ప్రయోజనం పొందాయన్నారు. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు భారత పరిస్థితులకు అనుగుణంగా తమను తాము ముందే సిద్ధం చేసుకున్నాయని, దాంతో రాణించాయన్నారు. భారత్‌కు రాక ముందు న్యూజిలాండ్ శ్రీలంకలో ఆడిందని.. అక్కడి పిచ్‌లు, వాతావరణం వారికి ఉపయోగపడిందన్నారు.
దక్షిణాఫ్రికా ఏ జట్టు భారత్‌లో ఇండియా-ఏతో మ్యాచ్ ఆడిందని.. ఇందులోని ఆటగాళ్లకు ఇక్కడి పరిస్థితుల గురించి తెలిసిందన్నారు. భారత జట్టు ఓటమికి ప్రధాన కారణం అదేనన్నారు. భారత జట్టును రెండు ఫార్మాట్ల మధ్య పదే పదే తిప్పడం వల్ల ఆటగాళ్లలో అలసట పెరుగుతోందన్నారు. టెస్ట్ క్రికెట్‌కు అవసరమైన సన్నద్ధత పొందకుండా నిరోధించబడుతుందన్నారు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడిన సమయంలో వన్డే సిరీస్ అవసరం లేదని.. ఎదుకంటే 2027లో వన్డే ప్రపంచకప్ జరుగుతుందన్నారు. అయినా భారత్ షెడ్యూల్‌ను ఫాలో కావాల్సి వచ్చిందన్నారు. ఇవన్నీ మార్కెట్ శక్తులన్ని.. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మార్కెట్ అని.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జట్లు టీమిండియాను ఆహ్వానిస్తాయన్నారు. అలా చేయడం వల్ల టెస్ట్ క్రికెట్ కోసం సన్నద్ధతపై ప్రభావం చూపుతుందన్నారు. భారత్ డొమెస్టిక్ సీజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆస్ట్రేలియా డొమెస్టిక్ సీజన్లో పర్యటనకు వెళ్లదని.. మనం సైతం అలా విదేశాలకు వెళ్లకూడదన్నారు.
2026లో T20 ప్రపంచ కప్ భారత్‌లో జరుగనుందని.. ఇకపై భారత్ దృష్టి వైట్‌బాల్ క్రికెట్‌పైకి మళ్లుతుందన్నారు. టెస్టుల్లో వరుస ఓటముల నేపథ్యంలో గంభీర్‌పై వస్తున్న విమర్శల సైతం సునీల్ గవాస్కర్ స్పందించారు. హెడ్‌కోచ్‌కు మద్దతుగా నిలిచారు. ఓటమికి కోచ్‌ను బాధ్యుడిని చేయడం అన్యాయమన్నారు. కోచ్ కోవలం జట్టును సిద్ధం చేయగలడని.. తన అనుభవంతో ఆటగాళ్లకు కేవలం సలహాలు మాత్రమే ఇవ్వగలడని.. మైదానంలో రాణించాల్సింది ఆటగాళ్లేనన్నారు. గంభీర్‌ను బాధ్యుడిని చేయాలని అడుగుతున్న వారికి తాను ఒకటే ప్రశ్న అడుగుతున్నానని.. గంభీర్ కోచింగ్‌లో భారత్ చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినప్పుడు మీరేం చేశారని నిలదీశారు. అప్పుడు గంభీర్‌కు జీవితకాలం కాంట్రాక్ట్ ఇవ్వాలని అడిగారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. జట్టు ఓడిపోయినప్పుడు కోచ్‌ను తప్పుపట్టడం అలవాటుగా మారిందని గవాస్కర్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. భారత జట్టు దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచుల వన్డే, ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనున్నది.