సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత జట్టు వరుసగా రెండో మ్యాచ్ కూడా ఓడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. బ్యాటర్లు విఫలమవడంతో కేవలం 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో భువనేశ్వర్ కుమార్ (4/13) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి సఫారీ జట్టు 29/3 స్కోరుతో నిలిచింది.
అది చూసిన అభిమానులు.. భారత్ గెలుస్తుందనే ఆశ పడ్డారు. కానీ ఆ తర్వాత మరో వికెట్ కోసం భారత బౌలర్లు చెమటోడ్చారు. ఈ క్రమంలో అక్షర్, చాహల్, పాండ్యా బౌలింగ్‌ను సఫారీ బ్యాటర్లు ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా సౌతాఫ్రికా కీపర్ హెన్రిక్ క్లాసెన్ (81) అద్భుతమైన ఆటతీరుతో సఫారీలను గెలిపించాడు.
అతనికి బవుమా (35), మిల్లర్ (20 నాటౌట్) కూడా సహకరించారు. చివర్లో క్లాసెన్ అవుటైనా కూడా.. అప్పటికి ఇంకా 5 పరుగులే అవసరం ఉండటంతో సౌతాఫ్రికా విజయం ఖాయమైంది. 19వ ఓవర్ రెండో బంతికి మిల్లర్ రెండు పరుగులు తీయడంతో.. సౌతాఫ్రికా జట్టు నాలుగు వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. చాహల్, హర్షల్ చెరో వికెట్ తీసుకున్నారు.