IND vs SA: వన్డే వరల్డ్ కప్‌లో భారత జైత్రయాత్ర అప్రతీహాతంగా సాగుతోంది. వరుసగా ఎనిమిదో విజయాన్ని నమోదుచేస్తూ టీమిండియా రికార్డులను బ్రేక్ చేసింది. ఈ మెగాటోర్నీలో పరుగుల వరద పారిస్తున్న సఫారీల ఆటలు భారత్ ముందు సాగలేదు. ఈ టోర్నీలో 400 పరుగులను అవలీలగా కొడుతున్న సౌతాఫ్రికా.. భారత్ నిర్దేశించిన 327 పరుగుల ఛేదనలో ముక్కీమూలుగుతూ కనీసం మూడంకెల స్కోరు కూడా చేయకుండా 83 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా భారత్.. 243 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించగా షమీ, కుల్దీప్ యాదవ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
క్వింటన్ డికాక్, బవుమా, వాండెర్ డసెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్‌తో పాటు ఆఖర్లో మార్కో జాన్సెన్ వంటి పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన సౌతాఫ్రికా.. భారత్ కు ఏ దశలో కూడా పోటీనివ్వలేదు. 327 పరుగుల ఛేదనలో రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా ఆ తర్వాత కోలుకోలేదు. డికాక్‌ను సిరాజ్ బౌల్డ్ చేయగా ఆ తర్వాత బాధ్యతను రవీంద్ర జడేజా తీసుకున్నాడు. వికెట్ స్లో గా స్పందించడాన్ని గమనించిన కెప్టెన్ రోహిత్.. జడ్డూను 9వ ఓవర్లోనే బరిలోకి దించాడు. తాను వేసిన మూడో బంతికే జడ్డూ.. బవుమాను బౌల్డ్ చేసి సఫారీలకు గట్టి హెచ్చరికలు పంపాడు. ఆ తర్వాత షమీ.. మార్క్రమ్ (9) ను ఔట్ చేయగా అత్యంత ప్రమాదకర క్లాసెన్‌ను జడ్డూ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
The Indian juggernaut rolls on in Kolkata 🔥#CWC23 | #INDvSA 📝: https://t.co/a4PZYqmQxY pic.twitter.com/IqQDYPEE7z
— ICC (@ICC) November 5, 2023
13 ఓవర్లలో 40 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో సౌతాఫ్రికాను షమీ కోలుకోనీయలేదు. 14వ ఓవర్లో తొలి బంతికే వాండెర్ డసెన్ (13)ను కూడా ఎల్బీగా వెనక్కి పంపాడు. ఇక ఆ తర్వాత జడ్డూ మరింత రెచ్చిపోయాడు. 17వ ఓవర్లో అతడు.. మిల్లర్ (11) ను కూడా బౌల్డ్ చేశాడు. 19వ ఓవర్లో నాలుగో బంతికి కేశవ్ మహారాజ్ (7) సైతం క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 30 బంతులాడి 14 పరుగులు చేసి కొంతసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న జాన్సెన్ను కుల్దీప్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే జడ్డూ.. రబాడా ఇచ్చిన స్ట్రెయిట్ క్యాచ్‌ను ఒడిసిపట్టుకుని తన ఖాతాలో ఐదో వికెట్‌ను వేసుకున్నాడు. ఇక మరుసటి ఓవర్లో తొలి బంతికే కుల్దీప్.. ఎంగిడిని బౌల్డ్ చేసి సఫారీల ఇన్నింగ్స్‌కు తెరదించాడు.