IND Vs SA | దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు విజయం సాధించింది. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ హర్షిత్ రాణా పాత్రపై ప్రశంసలు కురిపించారు. హర్షిత్ స్పెల్ మ్యాచ్‌ను మలుపు తిప్పిందని సితాన్షు తెలిపారు. హర్షిత్ తన ఓవర్లోనే ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్‌లను అవుట్ చేశాడు. ఆ తర్వాత డెవాల్డ్ బ్రెవిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. హర్షిత్ పది ఓవర్లలో 65 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను 17 పరుగుల తేడాతో ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్, విరాట్ కోహ్లీ సెంచరీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీలతో కదం తొక్కడంతో 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 349 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అయింది. మాథ్యూ బ్రీట్జ్కే (72), మార్కో జాన్సెన్ (70), కార్బిన్ బాష్ (67) అర్ధ సెంచరీలు చేశారు. భారత్ తరఫున కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా మూడు వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్‌కు రెండు వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణకు ఒక వికెట్ దక్కింది. హర్షిత్ ప్రదర్శనను కోటక్ ప్రశంసించాడు. ప్రారంభంలో వికెట్లు పడగొట్టకపోతే.. 350 పరుగుల లక్ష్యాన్ని భారత్ కాపాడుకోవడం అంత సులభం కాదని తెలిపాడు. తొలి వికెట్లు తీసినందుకు హర్షిత్‌కు చాలా క్రెడిట్ దక్కుతుందని పేర్కొన్నారు. మొదటి రెండు నుంచి ఐదు ఓవర్ల వరకు కూకబుర్రా బంతి నుంచి స్వింగ్ లభిస్తుందని.. దాన్ని అతను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడని తెలిపాడు. ఈ పిచ్‌పై 350 పరుగులు మంచి స్కోరేనని.. కానీ మంచు భారీగా ఉండడంతో బౌలర్లు బంతిని సరిగ్గా పట్టుకోలేకపోయారని తెలిపాడు.
బంతి నేరుగా బ్యాట్‌పైకి వచ్చిందని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌లో హర్షిత్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని.. ఎందుకంటే ప్రారంభంలో వికెట్లు తీసుకోకపోతే.. మ్యాచ్‌ను కాపాడుకోవడం కష్టమయ్యేదని చెప్పాడు. 50 ఓవర్ల క్రికెట్లో కోహ్లీ ఫిట్నెస్, ఫామ్ బాగుందని.. అతని వన్డే భవిష్యత్తుపై ఎలాంటి ఊహాగానాలు ఉండకూడదని సితాన్షు అభిప్రాయం వ్యక్తం చేశారు. కోహ్లీ భవిష్యత్తు గురించి చర్చ ఎందుకు జరుగుతుందో తనకు అర్థం కావడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మనం దీని గురించి ఎందుకు ఆలోచించాలో నాకు నిజంగా అర్థం కావడం లేదు. అతను ఇంత బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మనం అతని భవిష్యత్తు గురించి ఎందుకు మాట్లాడాలి? అతను ప్రదర్శన ఇస్తున్న విధానం, అతని ఫిట్నెస్ ఎలా ఉందో, దేని గురించి కూడా ఎలాంటి ప్రశ్న లేదు. అతను ఇలాగే బ్యాటింగ్ చేస్తూనే ఉన్నంత కాలం.. వేరే దేని గురించి మాట్లాడటంలో అర్థం లేదు’ అంటూ సితాన్షు స్పష్టం చేశారు.