IND Vs SA | భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ గురువారం జరగనుంది. తొలి టీ20లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతమైన ప్రదర్శన చేసి, ఏకపక్ష విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తాజాగా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని భావిస్తున్నది. అదే సమయంలో తొలి విజయం నమోదు చేసి సమం చేయాలని ప్రొటీస్ జట్టు కసితో ఉన్నది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలి టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. సాధారణంగా గెలిచిన కాంబినేషన్‌ను మార్చేందుకు ఏ జట్టు అంతగా ఇష్టపడదు.
మరి రెండో టీ20లో భారత్ ఈ రిస్క్ తీసుకుంటుందా? లేదా? చూడాల్సిందే. తొలి టీ20 కోసం భారత్ వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణాలను టీమ్ మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. శాంసన్‌ను పక్కనపెట్టి జితేష్ శర్మకు ప్రాధాన్యం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొన్నటి వరకు టీ20 జట్టులో శాంసన్ రెగ్యులర్ ఆటగాడు. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే, శుభ్‌మన్ గిల్ రాకతో ఓపెనింగ్ నుంచి మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. దాంతో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడంలో విఫలమయ్యాడు.
ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో గాయపడ్డ గిల్.. టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి టీ20లో నాలుగు పరుగులకే పెవిలియన్‌కు చేరి నిరాశ పరిచాడు. ఇటీవల కాలంలో గిల్ టీ20ల్లో విఫలమవుతూ వస్తున్నాడు. కటక్ టీ20లో తొలి ఓవర్లోనే గిల్ అవుట్ కావడంతో భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగింది. ఇక చండీగఢ్‌లో జరిగే రెండో టీ20లోనైనా రాణించాలని మెరుగ్గా రాణిస్తాడని భావిస్తున్నారు. టెస్ట్, వన్డే కెప్టెన్ అయిన గిల్ గత ఏడాది టీ20 ప్రపంచ కప్ వరకు విరాట్ కోహ్లీ పోషించిన పాత్రను సులభంగా పోషిస్తాడని భావిస్తున్నారు. భారత జట్టులో ఎనిమిదో నెంబర్ వరకు బ్యాటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. పవర్‌ప్లేలో అభిషేక్ శర్మలా గిల్ దూకుడుగా బ్యాటింగ్ చేయలేడని.. దాంతో తన పాత్రను ఎలా సమర్థవంతంగా పోషించాలని తెలుసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ కప్‌కు ముందు అతను ఫామ్‌లోకి రావడం భారత్‌కు చాలా కీలకం.
న్యూ చండీగఢ్‌లోని చల్లని వాతావరణంలో జరిగే మ్యాచ్‌లో భారత జట్టు కాంబినేషన్లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. కటక్‌లో ఆడిన ప్లేయింగ్ ఎలెవన్‌నే ముల్లాన్‌పూర్‌లో కూడా భారత్ బరిలోకి దింపే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకుని జాతీయ జట్టులోకి తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యా మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. భారత జట్టుకు తన అవసరం ఏంటో చాటిచెప్పాడు. కటక్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కష్టమైన పిచ్‌పై 28 బంతుల్లో చేసిన 59 పరుగులు చేశాడు. అలాగే, బంతితోనూ రాణించాడు. బ్యాటింగ్‌లో అజేయ హాఫ్ సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్‌లో ఒక వికెట్ తీశాడు. హార్దిక్ టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో 99 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో వంద వికెట్ల క్లబ్లో చేరేందుకు ఒకే వికెట్ దూరంలో ఉన్నాడు. రెండో టీ20లో హార్దిక్ ఒక వికెట్ తీస్తే.. టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసిన టీమిండియా మూడో బౌలర్‌గా నిలుస్తాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు.
తొలి మ్యాచ్‌లో జట్టు కూర్పును బట్టి చూస్తే.. ఇద్దరు కీలక బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ ఒకేసారి ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే జట్టు యాజమాన్యం ఎనిమిదో స్థానంలో బ్యాట్స్‌మెన్‌ను కోరుకుంటున్నది. తొలి మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌కు అవకాశం లభించింది. ఈ ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అర్ష్‌దీప్. జస్ప్రీత్ బుమ్రాతో కలిసి ఆరంభంలోనే వికెట్లు అందించాడు. ఇక ముల్లాన్‌పూర్ టీ20లో అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ ఆడే అవకాశం ఉన్నది.