గాయంతో ఆసియా కప్ నుంచి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తప్పుకోవడం ఆ జట్టుకు చాలా పెద్ద ఎదురుదెబ్బ అని పాకిస్తాన్ మాజీ లెజెండ్ యూనిస్ ఖాన్ అన్నాడు. బుమ్రా లేకపోతే పాకిస్తాన్‌కు అడ్వాంటేజ్ దక్కుతుందన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అతను లేకపోవడం వల్ల పాక్‌కు దక్కే అడ్వాంటేజీ కన్నా భారత్‌కు లోటే ఎక్కువన్నాడు. భారత జట్టు ఒక మ్యాచ్ విన్నర్‌ను కోల్పోయినట్లేనని అభిప్రాయపడ్డాడు.
‘‘బుమ్రా, హర్షల్ పటేల్ ఆడకపోవడం నిజంగా ఇతర జట్లకు ఒక రిలీఫ్’’ అని కొన్నిరోజుల క్రితం భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. గాయంతో భారత జట్టుకు ఈ ఇద్దరు కీలకమైన బౌలర్లు దూరమవగా.. టీమిండియాతో తొలి మ్యాచ్ ఆడనున్న పాకిస్తాన్‌కు కూడా గట్టిదెబ్బే తగిలింది. ఆ జట్టు ఏస్ పేసర్ షహీన్ అఫ్రిదీ కూడా మోకాలి గాయంతో టోర్నీకి దూరమయ్యాడు.