ముంబై వేదికగా జరుగుతున్న టెస్టులో భారత జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తోంది. న్యూజిల్యాండ్ జట్టు ముందు ఏకంగా 540 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన టీమిండియా.. వారిని ఒత్తిడిలో పడేసింది. దీనికితోడు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ ఇన్నింగ్స్‌లో కివీస్‌ను ఆదిలోనే దెబ్బకొట్టాడు.
కీలకమైన టామ్ లాథమ్ (6), విల్ యంగ్ (20), రాస్ టేలర్ (6) వికెట్లను పడగొట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ జట్టును డారియల్ మిచెల్ (60), హెన్రీ నికోల్స్ (36 నాటౌట్) జోడీ ఆదుకుంది. అయితే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించిన మిచెల్ క్యాచ్ అవుట్‌గా వెనుతిరిగాడు.
కాసేపటికే కేఎస్ భరత్ వేసిన తెలివైన త్రోకు టామ్ బ్లండెల్ (0) రనౌట్ అయ్యాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిల్యాండ్ జట్టు 140/5 స్కోరుతో నిలిచింది. భారత బౌలర్లలో అశ్విన్ ౩, అక్షర్ ఒక వికెట్ పడగొట్టారు.