మిడిలార్డర్ వైఫల్యంతో కనీసం పోరాడే స్కోరు చేస్తుందా? అనే స్థితిలో ఉన్న భారత జట్టును లోయర్ ఆర్డర్, బౌలర్లు రక్షించారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (29), రోహిత్ (56) ఇచ్చిన శుభారంభాన్ని టీమిండియా ఉపయోగించుకోలేకపోయింది. సూర్యకుమార్ యాదవ్ (0), రిషభ్ పంత్ (6) పూర్తిగా విఫలమయ్యారు. దీంతో రోహిత్ అవుటైన తర్వాత భారత్ స్కోరు 150 దాటితే ఎక్కువే అనుకున్నారు అభిమానులు.
కానీ వెంకటేశ్ అయ్యర్ (20), శ్రేయాస్ అయ్యర్ (25) కలిసి కాసేపు నిలబడ్డారు. అయితే వెటరన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఇద్దరూ భారీ షాట్లకు ప్రయత్నించి పెవిలియన్ చేరారు. దీంతో భారత్ కథ ముగిసిందనుకున్న కివీస్‌కు బౌలర్లు హర్షల్ పటేల్ (18), దీపక్ చాహర్ (21) చెమటలు పట్టించారు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (2) కూడా ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది.
అయితే లోకీ ఫెర్గూసన్ వేసిన ఓవర్లు షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హర్షల్ బ్యాటు వికెట్లను తాకడంతో అతను హిట్ వికెట్‌గా వెనుతిరిగాడు. చివర్లో దీపక్ చాహర్ కూడా బ్యాటు ఝుళిపించడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 184/7 స్కోరు సాధించింది. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్‌కు 3 వికెట్లు దక్కగా.. బౌల్ట్ ఫెర్గూసన్, ఇష్ సోధి, ఆడమ్ మిల్నే తలో వికెట్ తీశారు.