IND vs NED: భారత్-నెదర్లాండ్స్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ దుమ్ము రేపుతోంది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51)లు అర్థ సెంచరీలు సాధించి జట్టుకు శుభారంభాన్ని ఇవ్వగా విరాట్ కోహ్లీ (56 బంతుల్లో 51, 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. తనకు స్వంత గ్రౌండ్ అయిన చిన్నస్వామిలో కోహ్లీ 50వ సెంచరీ చేస్తాడని ఆశించిన అభిమానుల ఆశలపై డచ్ స్పిన్నర్ వాండెర్ మెర్వ్ నీళ్లు చల్లాడు.
తొలి వికెట్‌కు ఓపెనర్లు గిల్-రోహిత్‌లు 11.5 ఓవర్లలోనే వంద పరుగులు పూర్తిచేశారు. గిల్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. భారత స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. గిల్ ఔట్ అయ్యాక కొద్దిసేపటికే రోహిత్ కూడా ఔటయ్యాడు. రోహిత్ పెవిలియన్ చేరాక శ్రేయస్ అయ్యర్‌తో కలిసి కోహ్లీ మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించాడు. 53 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసిన కోహ్లీకి వన్డేలలో ఇది 71వ హాఫ్ సెంచరీ. కానీ 29వ ఓవర్లో నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శ్రేయస్ కూడా 48 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు.
కోహ్లీ ఔట్ అయినా శ్రేయస్ కూడా ధాటిగా ఆడుతుండటంతో భారత్ భారీ స్కోరుదిశగా సాగుతోంది. అయ్యర్‌తో పాటు కెఎల్ రాహుల్‌లు క్రీజులో ఉండటం, బాదడానికి ఓవర్లు కూడా ఉండటంతో ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరుపై కన్నేసింది. 34 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. శ్రేయస్ (54 నాటౌట్), రాహుల్ (10 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు.