IND Vs ENG | ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీతో అద్భుతంగా రాణించాడు. గిల్ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లండ్‌ను 336 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ, సెంచరీతో చెలరేగాడు. దాంతో ఏ ఆతిథ్య జట్టు సాధించలేని భారీ లక్ష్యం ఇంగ్లండ్ ముందుంచడంలో భారత్ విజయవంతమైంది.
బర్మింగ్‌హామ్‌లో జరిగిన టెస్టులో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌ను 407 పరుగులకు ఆలౌట్ చేయగా.. టీమిండియాకు 180 పరుగుల ఆధిక్యం లభించింది. శుభ్‌మన్ గిల్ సెంచరీ సహాయంతో టీమిండియా రెండవ ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో 607 పరుగుల ఆధిక్యాన్ని సాధించి.. ఇంగ్లండ్‌కు 608 పరుగల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బర్మింగ్‌హామ్ మ్యాచ్‌లో విజయం భారత్‌కు చారిత్రాత్మక విజయం. ఎందుకంటే టీమిండియా గతంలో ఎప్పుడూ ఇక్కడ టెస్టు మ్యాచ్ గెలువలేకపోయింది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 336 పరుగుల భారీ తేడాతో గెలుపొంది ఎడ్జ్‌బాస్టన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
25 సంవత్సరాల 301 రోజుల వయసులో విదేశాల్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన అతి పిన్న వయస్కుడైన భారత కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఈ విషయంలో 26 సంవత్సరాల 202 రోజుల వయసులో కెప్టెన్‌గా విదేశాల్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన సునీల్ గవాస్కర్‌ను అధిగమించాడు. 1976లో ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గవాస్కర్ నేతృత్వంలో టీమిండియా విజయాన్ని నమోదు చేసింది. రోహిత్ స్థానంలో గిల్ టెస్ట్ కెప్టెన్‌గా నియామకమైన విషయం తెలిసిందే. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి ఎదురైంది. హెడ్‌కోచ్, శుభ్‌మన్ గిల్ విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. శుభ్‌మన్ గిల్ పట్టు వదలకుండా ఇంగ్లండ్ కంచుకోటగా చెప్పుకునే ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలోనే ఆతిథ్య జట్టును భారీ తేడాతో ఓడించి టీమిండియా బలంగా పునరాగమనం చేసింది. గిల్ నాయకత్వంలో భారత్ తొలిసారి టెస్ట్ గెలిచింది. బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన తొలి ఆసియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఘనత సాధించాడు.
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ మంచి ప్రదర్శన ఇచ్చారు. రెండుజట్లు కలిసి నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం 1628 పరుగులు చేశారు. ఇది ఇంగ్లండ్‌లో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు కావడం రెండోసారికావడం విశేషం. ఇంతకు ముందు లీడ్స్‌లో 1948లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో అత్యధిక పరుగులు నమోదయ్యాయి. ఆ మ్యాచ్‌లో మొత్తం 1650 పరుగులు చేశారు. అదే సమయంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన బర్మింగ్‌హామ్ టెస్టులో మొత్తం 220 బౌండరీలో నమోదయ్యాయి. ఇది ఇంగ్లండ్‌లో జరిగిన ఒక టెస్టులో ఇన్ని బౌండరీలు నమోదవడం ఇది రెండోసారి. 2022లో నాటింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో 249 బౌండరీలు నమోదయ్యాయి. ఇంగ్లండ్-న్యూజిలాండ్ పేరిట ఈ రికార్డు ఉన్నది.