Bazball | టెస్టులు ఆడే విధానాన్ని మారుస్తున్నామంటూ చెప్పుకుంటూ స్వదేశంతో పాటు విదేశాల్లోనూ నానా హంగామా చేస్తున్న ‘బజ్‌బాల్’ టీమ్‌కు భారత్‌లో ఎదురుదెబ్బ తప్పలేదు. సుమారు రెండేండ్లుగా తాము పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా వచ్చిన విజయాలకు రోహిత్ శర్మ సారథ్యంలోని కుర్రాళ్లు ఓటమి రుచి చూపించారు. తోపు క్రికెటర్లు ఉన్న ఇంగ్లండ్‌కు.. మీ ఆటలు ఇక్కడ సాగనివ్వం అని చెప్పకనే చెప్పారు. ఓటమన్నదే లేకుండా దూసుకుపోతున్న బ్రెండన్ మెక్కల్లమ్, బెన్ స్టోక్స్ ద్వయానికి, ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకూ ఆత్మపరిశీలన అవసరమనేలా స్టేట్మెంట్ ఇచ్చారు. దూకుడుగా ఆడటమే కాకుండా పరిస్థితులకు తగ్గట్టు ఆడితేనే టెస్టులలో ఫలితాలు వస్తాయని నిరూపించింది కుర్ర భారత్..
అప్పుడు మొదలైంది..
ఐపీఎల్ – 2022 తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ కోచింగ్ బాధ్యతలను వదిలిపెట్టిన మెక్కల్లమ్.. ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కోచ్‌గా వెళ్లాడు. అప్పటికీ ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఓటమితో పాటు వెస్టిండీస్ మీద కూడా ఓడి దారుణ విమర్శలు ఎదుర్కుంటుంది. దీంతో నాటి సారథి జో రూట్ తన బాధ్యతలను వదిలేయడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ).. బెన్ స్టోక్స్‌కు ఆ పగ్గాలు అప్పజెప్పింది. మెక్కల్లమ్ – స్టోక్స్‌ల తొలి సవాల్ స్వదేశంలోనే. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసింది. అప్పుడు మొదలైంది ఈ బజ్‌బాల్ కథ. నాటి నుంచి నేటి రాంచీ టెస్టు దాకా ఎక్కడికెళ్లినా బజ్‌బాల్.. బజ్‌బాల్.. బజ్‌బాల్..
అప్రతిహాత విజయాలు..
కివీస్‌పై సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో ఇంగ్లండ్‌పై ప్రశంసలు ముంచెత్తాయి. ఆ తర్వాతే ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో రీషెడ్యూల్డ్ టెస్టులోనూ టీమిండియా నిర్దేశించిన 375 పరుగుల ఛేదనను ఇంగ్లండ్ అలవోకగా ఛేదించింది. ఇదే ఊపులో స్వదేశంలోనే సౌతాఫ్రికాపై సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఇక 2022 డిసెంబర్లో సుదీర్ఘకాలం తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్.. అక్కడ సంచలనాలు నమోదుచేసింది. రావల్పిండి టెస్టులో ఒక్కరోజే 500 ప్లస్ పరుగులు చేసిన స్టోక్స్ సేన.. ముల్తాన్ టెస్టులో ఆఖరి రోజు మరో రెండు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనగా ఆఖరి వికెట్ పడగొట్టి సంచలన విజయాన్ని అందుకుంది. అక్కడా మూడు మ్యాచ్‌లను గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది. ఇదే క్రమంలో న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టుల సిరీస్‌లో తలా ఒక మ్యాచ్ గెలవడంతో సిరీస్ డ్రా అయింది. గతేడాది స్వదేశంలో ఐర్లాండ్‌తో ఒక్క మ్యాచ్‌లో ఈజీగా గెలిచిన ఇంగ్లండ్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టులో ఓడినా తర్వాత పుంజుకుంది. ఈ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది.
India breach the Bazball gate 💪 pic.twitter.com/L96Yik3Su7
— ESPNcricinfo (@ESPNcricinfo) February 26, 2024
ఓటమి రుచి చూపిన భారత్..
యాషెస్ సిరీస్ డ్రా తర్వాత ఇంగ్లండ్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. అదీగాక బజ్‌బాల్ కాలంలో ఇంగ్లండ్‌కు ఇదే తొలి సిరీస్. భారత్‌లో బజ్‌బాల్ ఆట కుదరదని, పరిస్థితులకు తగ్గట్టు ఆడాలని మాజీలు సూచించినా స్టోక్స్ – మెక్‌కల్లమ్‌లు మాత్రం తమ ఆట విధానాన్ని మార్చలేదు. అందుకు తగ్గట్టుగానే హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్ సంచలన విజయం. కానీ అదే ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసాన్ని అమాంతం నేలకు దించింది. సీనియర్ ప్లేయర్ల గైర్హాజరీలో యువ భారత్.. బజ్‌బాల్‌ను కుమ్మేసింది. వైజాగ్ టెస్టులో ఛేదనలో తడబడ్డా ఆ జట్టుకు ఇక్కడి పిచ్‌లపై నాలుగో ఇన్నింగ్స్‌లో ఎలా ఆడాలో తెలిసిరానట్టే ఉంది. రాజ్‌కోట్‌లో అయితే ‘మా వల్ల కాదు బాబోయ్’ అని ఇంగ్లండ్ గంపగుత్తగా చేతులెత్తేసింది. ఇక సిరీస్ డిసైడర్ అయిన రాంచీ పిచ్ చూడగానే స్టోక్స్ సేన ఇక్కడ తిప్పలు తప్పవు అని తెలిసినా బజ్‌బాల్ ఆటతీరును మార్చుకోక తంటాలు పడింది. ఫలితం.. బజ్‌బాల్‌కు తొలి సిరీస్ ఓటమి…

బెన్ స్టోక్స్ సారథ్యంలో ఇంగ్లండ్..
– ఆడిన టెస్టులు : 23
– గెలిచినవి : 14
– ఓడినవి : 08
– డ్రా : 1
మెక్కల్లమ్ – స్టోక్స్‌ల హయాంలో..
– ఆడినవి : 19
– గెలిచినవి : 13
– ఓడినవి : 04
– డ్రా : 01