Michael Vaughan | ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ వికెట్ రిషబ్ పంత్ గాయపడ్డ విషయం తెలిసిందే. కాలికి గాయమైనప్పటికీ రెండోరోజు గురువారం బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ.. అద్భుతమైన హాఫ్ సెంచరీ చేయగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా క్రికెట్ రూల్స్‌పై విమర్శలు గుప్పించాడు. క్రికెట్ ఇంకా చీకటి యుగంలోనే ఉందనడానికి పంత్ ఘటన నిదర్శనమని మాజీ కెప్టెన్ పేర్కొన్నాడు. పంత్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో రెండోరోజు 37 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. కుడి కాలి బొటనవేలుకి గాయనమైనప్పటికీ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. గాయం తర్వాత 28 బంతులు ఎదుర్కొని 17 పరుగులు చేశాడు. మొత్తం 75 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 54 పరుగులు చేశాడు. గాయం ఉన్నప్పటికీ సింగిల్ కోసం పరుగు తీయాల్సిన పరిస్థితి వచ్చింది.
‘ది టెలిగ్రాఫ్’కు రాసిన కాలమ్‌లో మైఖేల్ వాన్ స్పందిస్తూ.. టెస్ట్ క్రికెట్లో స్పష్టమైన గాయాలైన సందర్భంలో ప్రత్యామ్నాయంగా టెస్టుల్లో సబ్‌స్టిట్యూట్‌ను అనుమతించాలని తాను భావిస్తున్నానని పేర్కొన్నాడు. నాల్గవ టెస్ట్‌లో రిషబ్ పంత్ కాలికి గాయమైనా బ్యాటింగ్ చేయడాన్ని చూడడం నిజంగా అద్భుతమైన అనుభవమని తెలిపారు. 28 బంతుల్లో 17 పరుగులు చేయడం అద్భుతమైన ధైర్యం, అద్భుతమైన నైపుణ్యమని.. అయితే, బ్యాటింగ్ చేసేందుకు పూర్తిగా ఫిట్‌గా లేడని, పరుగెత్తలేకపోయాడని గుర్తు చేశాడు. దాంతో గాయం మరింత తీవ్రతరమయ్యేదని పేర్కొన్నారు. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. అతను (పంత్) వికెట్ కీపర్‌గా ప్రత్యామ్నాయంగా ఆడేందుకు అనుమతి ఇచ్చారని.. కానీ బ్యాటింగ్, బౌలింగ్ చేయడానికి అనుమతి ఇవ్వలేదని.. ఇది కొంచెం వింతగా ఉందన్నారు. ఇలా జరిగే ఏకైక ఆట క్రికెట్ మాత్రమేనని.. క్రికెట్ ఇప్పటికీ చీకటి యుగంలో ఉందని తాను భావిస్తున్నానని మాజీ కెప్టెన్ పేర్కొన్నారు.
పాత నియమాల వల్ల మ్యాచ్ నాలుగు రోజులు ఓ జట్టు పది మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి ఉంటుందని.. కాబట్టి ఆ ప్రభావాన్ని ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఒక ఆటగాడు వెన్నుగాయం, కండరాల ఒత్తిడితో బాధపడితే ఆడలేడని.. స్కానింగ్, డాక్టర్ ధ్రువీకరించే గాయాలైన సందర్భంలో ప్రత్యామ్నాయంగా మరో ఆటగాడిని తీసుకునే సౌలభ్యంగా ఉండాలన్నారు. వాస్తవానికి క్రికెట్లో గతంలో బై రన్నర్‌కు అవకాశం ఉండేది. కానీ, ఈ రూల్‌ను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఐసీసీ 2011 అక్టోబర్ 1న రద్దు చేసింది. అయితే, కంకషన్ సబ్‌స్టిట్యూషన్‌కు మాత్రం ఐసీసీ అవకాశం ఇచ్చింది. కంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్ ప్రకారం.. ఆటగాడి తలకు తీవ్ర గాయమైతే అతని స్థానంతో మరో ఆటగాడిని ఆడించేందుకు అవకాశం ఉంటుంది. సదరు ఆటగాడు బ్యాటింగ్, బౌలింగ్ సైతం చేసే వీలుంటుంది. గాయపడ్డ ఆటగాళ్లకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. అయితే, పంత్ గాయం ఉన్నప్పటికీ సైతం బ్యాటింగ్ చేయాల్సి రావడం.. ఐసీసీ రూల్స్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూల్‌ను దుర్వినియోగం చేసుకుండా చూడాలని సూచించారు. మైఖేల్ వాన్ సైతం ఇదే డిమాండ్ చేశారు.