IND vs ENG 3rd Test | స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అరంగేట్రం చేసిన టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్.. తాను ఆడుతున్న తొలి ఇన్నింగ్స్‌లోనే తానెంత విలువైన ఆటగాడో నిరూపించుకుంటున్నాడు. ఇన్నాళ్లు సెలక్టర్లు తనను పక్కనబెట్టినందుకు వాళ్లు చింతించాలని ఆడాడో లేక జాతీయ జట్టులోకి వచ్చినందుకు కసిగా ఆడుతున్నాడో గానీ సర్ఫరాజ్ మాత్రం ఇంగ్లీష్ ఆటగాళ్లకు అసలైన బజ్‌బాల్ ఆట చూపించాడు. 48 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న సర్ఫరాజ్.. ఈ క్రమంలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
భారత్ తరఫున టెస్టులలో అరంగేట్ర మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన భారత క్రికెటర్లలో సర్ఫరాజ్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో యువరాజ్ ఆఫ్ పాటియాలా, హార్ధిక్ పాండ్యాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 1934లో ఇదే ఇంగ్లండ్‌తో ఆడిన మ్యాచ్‌లో యువరాజ్ ఆఫ్ పాటియాలా.. 42 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 2017లో శ్రీలంకతో టెస్టులో ఎంట్రీ ఇచ్చిన హార్దిక్.. 48 బంతుల్లో అర్థ శతకం బాదాడు. తాజాగా సర్ఫరాజ్ కూడా ఇదే ఫీట్‌ను సాధించాడు. 2013లో శిఖర్ ధావన్.. 50 బంతుల్లో అర్థ సెంచరీ చేయగా, 2018లో వెస్టిండీస్‌తో తొలి టెస్టు ఆడుతూ పృథ్వీ షా 56 బంతుల్లో 50 పరుగులు సాధించాడు.
In No Time!
5⃣0⃣ on Test debut for Sarfaraz Khan 👏 👏
Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/F5yTN44efL
— BCCI (@BCCI) February 15, 2024
జడేజా 84 పరుగుల వద్ద ఉండగా క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్.. వేగంగా ఆడాడు. రెండంకెల స్కోరు చేరగానే తొలి బౌండరీ బాదిన సర్ఫరాజ్.. తర్వాత వరుస ఓవర్లలో బంతిని బౌండరీకి తరలించాడు. టామ్ హర్ట్లీ వేసిన 76వ ఓవర్లో ఐదో బంతికి కొట్టిన సిక్సర్ అతడి ఇన్నింగ్స్‌కే హైలైట్. ఆ తర్వాత బంతికే సింగిల్ తీసి అతడు అర్థ సెంచరీ పూర్తిచేశాడు. దూకుడుగా ఆడుతున్న సర్ఫరాజ్.. జడేజా 99 పరుగుల వద్ద ఉండగా పరుగు తీయబోయి సమన్వయ లోపంతో రనౌట్ అవడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది.