IND Vs AUS | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నది. అయితే, ఈ సిరీస్‌లో బౌలింగ్ భారమంతా మిస్టరీ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపైనే పడుతున్నది. ఈ క్రమంలో మాజీ కోచ్ రవిశాస్త్రి టీమ్ మేనేజ్మెంట్ కీలక సూచనలు చేశాడు. బుమ్రాపై భారాన్ని తగ్గించేందుకు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాకు పంపాలని చెప్పాడు. షమీ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొంటున్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) మెడికల్ టీమ్, బీసీసీఐ (BCCI) సెలెక్టర్లు షమీ ఫామ్‌ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో భారత జట్టు ఆడుతున్నది. ఈ సందర్భంగా రవిశాస్త్రి సూచనలు చేశాడు. షమి చాలానే దేశవాళీ క్రికెట్ ఆడాడని.. బుమ్రా బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టు ఎంత ఒత్తిడికి గురవుతుందో చూడొచ్చని.. అతనిపై భారీగా ఒత్తిడి ఉందని తెలిపాడు. షమీ బెంగాల్ తరఫున దేశవాళీ టీ20 టోర్నీలో ఏడు మ్యాచులు ఆడి ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. పలు అద్భుతమైన స్పెల్స్ ఉన్నాయి.
ఈ నెల 14 నుంచి 18 మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగే మూడో టెస్ట్‌కు షమీ అందుబాటులో ఉంటాడని ప్రకటించడం తొందరపాటవుతుందని మాజీ కోచ్ చెప్పుకొచ్చాడు. మెల్బోర్న్, సిడ్నీ టెస్టులకు షమీ అందుబాటులో ఉండవచ్చన్నారు. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియా టెస్టుల్లో షమీకి మంచి రికార్డే ఉన్నది. 12 మ్యాచుల్లో 44 వికెట్లు పడగొట్టాడు. మరో వైపు షమీ ఫిట్నెస్ పరిశీలించేందుకు సెలెక్టర్, ఎన్సీఏ సిబ్బంది ఇటీవల రాజ్‌కోట్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సిరీస్‌కు షమీని ఎప్పుడైనా పంపవచ్చని తెలుస్తున్నది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో బుమ్రా మంచి ఫామ్‌లో ఉన్నాడు. పెర్త్ టెస్టులో మొత్తం ఎనిమిది వికెట్లతో సహా ఇప్పటివరకు 12 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో కీలకమైన ఆటగాళ్ల పనిభారాన్ని గమనించాల్సి ఉంటుంది. జట్టు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు కీలమైన ఆటగాడు. అతనిపై అదనపు భారం వేసేందుకు టీమ్ మేనేజ్మెంట్ కోరుకునే అవకాశం లేదు.