IND Vs AUS | బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా దూసుకువెళ్తున్నది. తొలిరోజు వర్షం కారణంగా కేవలం 13.2 ఓవర్లు మాత్రమే ఆట సాధ్యమైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. మిచెల్ స్టార్క్ ఏడు పరుగులతో, అలెక్స్ కారీ 45 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ట్రావిస్ హెడ్ 152 పరుగులు, స్టీవ్ స్మిత్ 101 పరుగులు చేశారు. మరోవైపు, భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు.
ఉదయం 28 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండోరోజు బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఆదివారం 377 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్లో ఉస్మాన్ ఖవాజా (21), నాథన్ మెక్‌స్వీనీ (9)లను బుమ్రా పెవిలియన్‌కు పంపి ఆసిస్‌కు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత మార్నస్ లాబుస్చగ్నే (12)ను నితీశ్‌రెడ్డి అవుట్ చేశాడు. ఆ తర్వాత, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ జోడీ రెండో సెషన్లో టీమిండియాకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడుతూ వీలు చిక్కినప్పుడల్లా పరుగులు తీశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 242 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
హెడ్ టెస్ట్ కెరీర్లో తొమ్మిదో సెంచరీని సాధించాడు. స్టీవ్ స్మిత్ 33వ సెంచరీని నమోదు చేశాడు. 190 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేసిన స్మిత్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 160 బంతుల్లో 18 ఫోర్ల సాయంతో 152 పరుగులు చేసి ట్రావిస్ హెడ్ పెవిలియన్ బాటపట్టాడు. ఐదు పరుగుల వద్ద మిచెల్ మార్ష్, 20 పరుగుల వద్ద కెప్టెన్ పాట్ కమిన్స్ అవుట్ అయ్యారు. ఏడో వికెట్‌కు కారీతో కలిసి కమిన్స్ 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టీమిండియా మిస్టరీ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి ఐదు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, నితీశ్రెడ్డిలకు చెరో వికెట్ దక్కింది.