Rohit Sharma | పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఈ సిరీస్‌లో రోహిత్ కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఆడనున్నాడు. ఇటీవల టీమిండియా వన్డే జట్టు కెప్టెన్‌గానూ గిల్‌కు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. రోహిత్ చాలారోజుల తర్వాత మైదానంలో టీమిండియా జెర్సీలో కనిపించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ వచ్చాడు. ఈ మ్యాచ్‌తో ప్రత్యేక జాబితాలో చేరాడు.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా సైతం ఇద్దరికి కొత్తగా జట్టులో చోటు కల్పించింది. పెర్త్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత జట్టు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లకు చోటు కల్పించింది. భారత జట్టు వన్డేల్లో వరుసగా 16వ సారి టాస్ ఓడిపోయింది. ఈ ఫార్మాట్లో చివరిసారిగా భారత్ 2023 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై టాస్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి వచ్చారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మళ్లీ భారత జట్టు తరఫున వన్డేల్లో బరిలోకి దిగారు. రోహిత్, కోహ్లీ దాదాపు 224 రోజుల తర్వాత బ్లూడ్రెస్‌లో కనిపించారు. చాలా రోజుల తర్వాత మైదానంలోకి వచ్చిన రోహిత్ ఈ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 16 నిమిషాల పాటు క్రీజులో ఉన్నారు. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో రోహిత్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 14 బంతుల్లో ఎనిమిది పరుగులు చేసి ఒక ఫోర్ చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించడం ద్వారా అరుదైన ఘనత సాధించాడు. రోహిత్‌కు ఇది 500వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ జాబితాలో ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకు ముందు ఈ జాబితాలో సచిన్, విరాట్, మహేంద్ర సింగ్ ధోని, రాహుల్ ద్రవిడ్ మాత్రమే 500 కంటే ఎక్కువ మ్యాచులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ముందున్నారు.