IND vs AUS : ఇండోర్ టెస్టులో రెండో రోజే భారత్ ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులు చేసింది. దాంతో పర్యాటక ఆసీస్ ముందు 76 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాథన్ లయాన్ ఎనిమిది వికెట్లు తీసి భారత్‌ను దెబ్బ తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్ విఫలం అయింది. స్పిన్నర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. నయావాల్ ఛటేశ్వర్ పూజారా ఒక్కడే నిలబడ్డాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా ఓపికగా ఆడిన అతను హాఫ్ సెంచరీ(59)తో ఆదుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 109కు ఆలౌట్ అయింది. కునేమన్ ఐదు, లయాన్ మూడు, మర్ఫీ ఒక వికెట్ తీశారు. తర్వాత బ్యాంటిగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 197కు పరిమితం అయింది.
రెండో ఇన్నింగ్స్‌లో పూజారా అడ్డు గోడలా నిలిచాడు. ఆస్ట్రేలియా స్పిన్ త్రయాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ సాధించాడు. కునేమాన్ ఓవర్లో సింగిల్ తీసి 50 పరుగులకు చేరువయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అతను జడేజా (7), శ్రేయాస్ అయ్యర్(26)తో కలిసి స్కోర్‌బోర్డును ముందుకు నడిపించాడు. టీ బ్రేక్ సమయానికి ఇండియా 79/4 ఉంది. అయితే.. స్టీవ్ స్మిత్ ఫీల్డర్లను మోహరించి బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. దాంతో జడేజా, అయ్యర్ భారీ షాట్లు ఆడలేక పోయారు. డిఫెన్స్ ఆడే క్రమంలో వాళ్లు త్వరగా ఔటయ్యారు. లెగ్ స్లిప్‌లో కెప్టెన్ స్టీవ్ స్మిత్ సూపర్ క్యాచ్ అందుకోవడంతో పూజారా (59) మారథాన్ ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో అశ్విన్ (16), అక్షర్ పటేల్ (15) పర్వాలేదనిపించారు.
పిచ్ స్పిన్‌కు అనుకూలించడంతో నాథన్ లయాన్ చెలరేగిపోయాడు. ఏడు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ (16)ను ఎల్బీగా ఔ చేసి ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు. భారత్‌పై అతను ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది తొమ్మిదో సారి. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసి దీటుగా బదులివ్వాలని టీమిండియా అనుకుంది. కానీ, లయాన్ కీలకమైన వికెట్లు తీసి భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. రోహిత్ శర్మ (12), శుభ్‌మన్ గిల్ (5), రవీంద్ర జడేజా (7), కేఎస్ భరత్(3), పూజారా (59), ఉమేశ్ యాదవ్ (0)లను ఔట్ చేశాడు.
లయాన్ బౌలింగ్‌లో ఎక్కువ సార్లు ఔటైన భారత బ్యాటర్‌గా పూజారా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటివరకు 13 సార్లు పూజారా అతని బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అజింక్య రహానే (10 సార్లు) రెండు, రోహిత్ శర్మ (8 సార్లు) మూడు, విరాట్ కోహ్లీ (7 సార్లు) నాలుగు స్థానాల్లో ఉన్నారు.