Rohit Sharma | టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. టెస్టులు, వన్డేలు, టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఇకపై దేశవాళీ, ఐపీఎల్లో అశ్విన్ కనిపించనున్నాడు. గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసిన అనంతరం.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అశ్విన్ విలేకరుల సమావేశానికి వచ్చాడు. ఆ సమయంలోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. అయితే, పింక్ బాల్ టెస్ట్ వరకు కొనసాగాలని తాను అశ్విన్‌ను కోరినట్లు రోహిత్ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా టూర్‌కు చేరుకున్న తర్వాత రిటైర్మెంట్పై అశ్విన్ నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. అడిలైడ్ వేదికగా జరిగిన డే-నైట్ టెస్ట్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.
అయితే, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్, బ్రిస్బేన్‌లో జరిగిన టెస్టుల్లో చోటు దక్కలేని విషయం తెలిసిందే. రవిచంద్రన్ అశ్విన్ ఈ నెల 19న భారత్‌కు వెళ్తాడని రోహిత్ వివరించాడు. అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని పెర్త్ టెస్ట్ తర్వాత కలిసిన సమయంలో తెలుసుకున్నట్లు రోహిత్ తెలిపాడు. జట్టు ప్రణాళిక, కలయికను అర్థం చేసుకున్నాడని.. అందుకే బ్రిస్బేన్‌లో జరిగిన మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడని టీమిండియా కెప్టెన్ వెల్లడించాడు. తొలి టెస్ట్ సమయంలోనే రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పగా.. పింక్ బాల్ టెస్ట్ వరకైనా కొనసాగాలని ఒప్పించినట్లు వివరించాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం వెనుక కారణాలు సైతం ఉన్నాయని పేర్కొన్నారు. రిటైర్మెంట్పై అశ్విన్ నిర్ణయం వ్యక్తిగతమని.. దాన్ని గౌరవిస్తానని చెప్పాడు. రిటైర్మెంట్పై అన్ని ప్రశ్నలకు అశ్విన్ సమాధానం ఇస్తాడని చెప్పాడు.
జట్టుకు ఏది అవసరమో అతనికి తెలుసునని.. తాము ఎలాంటి కాంబినేషన్ ఆలోచిస్తున్నామనే దానిపై స్పష్టమైన అవగాహన ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు. తనకు అవకాశం రానప్పుడు ఆటకు వీడ్కోలు పటకటం మంచిదని అశ్విన్ బావించి ఉండవచ్చని రోహిత్ అన్నాడు. అశ్విన్‌తో కలిసి తాను చాలా మ్యాచ్‌లు ఆడానని రోహిత్ గుర్తు చేసుకున్నాడు. అండర్ -17 స్థాయి నుంచి అశ్విన్ తనకు తెలుసున్న రోహిత్.. తొలుత ఓపెనర్‌గా వచ్చేవాడని గుర్తు చేసుకున్నాడు. చాలా రోజులు కనిపించకుండాపోయాడని.. కొద్దికాలం తర్వాత తమిళనాడు తరఫున ఓ బౌలర్ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడని విన్నానని.. అది ఎవరా అని ఆరా తీస్తే అశ్వినేనంటూ గుర్తు చేసుకున్నాడు రోహిత్. బ్యాటర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. బౌలర్ అవతారం ఎత్తడం ఆశ్చర్యమనిపించిందన్నాడు. సుదీర్ఘకాలం పాటు ఇద్దరం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగామని.. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయని తెలిపాడు. జట్లు విజయాల్లో కీలకపాత్ర పోషించాడంటూ అశ్విన్‌కు రోహిత్ కితాబునిచ్చాడు.