ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలీలో ఆడుతున్న తొలి మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (55), సూర్యకుమార్ యాదవ్ (46), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 71 నాటౌట్) అద్భుతంగా ఆడారు. దీంతో భారత జట్టు మెరుగైన స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.
కెప్టెన్ రోహిత్ శర్మ (11) విఫలమవగా.. ఫామ్ అందుకున్నాడని అనుకున్న విరాట్ కోహ్లీ (2) కూడా నిరాశ పరిచాడు. ఆ తర్వాత సూర్య, కేఎల్ జోడీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. అయితే వీళ్లిద్దరూ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ నిలబెట్టే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్న హార్దిక్ పాండ్యా.. మెరుగైన ఆటతీరు కనబరిచాడు.
అక్షర్ పటేల్ (6), దినేష్ కార్తీక్ (6) అతనికి సపోర్ట్ ఇవ్వలేకపోయారు. చివర్లో వచ్చిన హర్షల్ పటేల్ (7 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆసీస్ బౌలర్లలో యువపేసర్ నాథన్ ఎల్లీస్ మూడు వికెట్లతో చెలరేగగా.. జోష్ హాజిల్‌వుడ్ 2, కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ తీసుకున్నారు.