Nitish Reddy | టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డిని మాజీ కెప్టెన్ సునీల్ గవార్కర్ ప్రశంసలతో ముంచెత్తారు. భారత క్రికెట్ షైనింగ్ స్టార్‌గా పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో నితీశ్ అద్భుత సెంచరీ సాధించాడు. నితీశ్‌కు టెస్టు కెరీర్లో ఇదే తొలి సెంచరీ. మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులు చేశాడు. అయితే, ఈ ఇన్నింగ్స్‌తో జట్టును గెలువలేకపోయింది. హార్దిక్‌తో నితీశ్‌ను గవాస్కర్ పోల్చారు. తొలినాళ్లలో హార్దిక్ కంటే నితీశ్ చాలా బెటర్ అని చెప్పారు. స్పోర్ట్స్ వెబ్సైట్ కాలమ్ రాశారు. యువ స్టార్లలో ఒకరైన నితీశ్‌కుమార్ రెడ్డిని మెల్బోర్న్ టెస్ట్ తెరపైకి తెచ్చింది.
హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఆడుతున్న సమయంలోనూ భారత క్రికెట్ జట్టు అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్‌తో పాటు ఫస్ట్ క్లాస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి నితీశ్‌కు టెస్ట్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం కల్పించింది. నితీశ్ పెర్త్, అడిలైడ్ టెస్టుల్లో 40 కంటే ఎక్కువగా పరుగులు చేశాడు. కానీ, తొలిసారిగా మెల్బోర్న్ టెస్టులో 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఆ తర్వాత దాన్ని సెంచరీగా మలచడంలో సఫలమయ్యాడు. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో సెంచరీ చేసిన మూడో అతి పిన్న వయస్కుడిగా నితీశ్ నిలిచాడు. సచిన్ టెండూల్కర్, రిషబ్ పంత్ మాత్రమే ఈ ఘనత సాధించారు. మెల్బోర్న్ టెస్ట్ నితీశ్‌రెడ్డికి ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే సెంచరీ సాధించిన సమయంలో నితీశ్‌రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి సైతం అక్కడే ఉన్నారు. సెంచరీ తర్వాత ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా గవాస్కర్ స్పందిస్తూ.. పెర్త్‌లో అరంగేట్రం మ్యాచ్‌లో నితీశ్ పరిస్థితిని అర్థం చేసుకొని ఆడే క్రికెటర్ అని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రతి టెస్ట్ మ్యాచ్‌లో రోజురోజుకు రాణించాడని.. మెల్బోర్న్లో భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో సెంచరీ సాధించి జట్టులో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పారు. హార్దిక్ టెస్ట్ క్రికెట్‌కు దూరమైన నాటి నుంచి మీడియం పేస్‌లో బౌలింగ్, బ్యాటింగ్ చేయగల ఆల్ రౌండర్ కోసం భారత్ వెతుకుతోందని.. నితీశ్ బౌలింగ్ ప్రస్తుతం పురోగమిస్తుందని పేర్కొన్నారు. కెరీర్ మొదట్లో హార్దిక్ కంటే నితీశ్ మెరుగ్గా కనిపించాడని చెప్పారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నితీశ్ ఇప్పటి వరకు 294 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు.