IND vs AUS BGT : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు ఓటమి తప్పేలా లేదు. భారత్ నిర్దేశించిన 534 పరగుల భారీ లక్ష్యచేధన కోసం రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే కష్టాల్లో కూరుకుపోయింది. మూడో రోజు చివరలో 4.2 ఓవర్లు ఆడి కేవలం 12 పరుగులు మాత్రమే చేసిన ఆస్ట్రేలియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
ఓపెనర్ నాథన్ మెక్ స్వీని పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాటపట్టాడు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మెక్ స్వీనిని ఎల్బీడబ్య్లూ చేశాడు. ఆ తర్వాత వన్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా రెండు పరుగులు చేసి ఔటయ్యాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో కమ్మిన్స్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత మార్నస్ లబుషేన్ కూడా తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. లబుషేన్‌ను కూడా కెప్టెన్ బుమ్రానే ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనక్కి పంపాడు.
దాంతో ఆస్ట్రేలియా కేవలం 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తొలి టెస్టులో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. విజయాన్ని ముద్దాడాలంటే ఆస్ట్రేలియా మరో 522 పరుగులు రాబట్టాల్సి ఉంటుంది. భారత్ మిగిలిన ఏడు వికెట్లు పడగొడితే విజయం దక్కుతుంది.