IND Vs AUS | బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఈ నెల 26 నుంచి మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ జరగనున్నది. ఈ బాక్సింగ్ డే టెస్టుపై అందరి దృష్టి ఇద్దరు ఆటగాళ్లపైనే పడింది. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరో కాదు. భారత జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. మరొకరు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్. ఈ ఇద్దరు పలు రికార్డులకు దగ్గరలో ఉన్నారు. ఈ సిరీస్‌లో మిస్టరీ స్పిన్నర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకునేందుకు కేవలం ఆరు వికెట్ల దూరంలో ఉన్నాడు. ఈ టెస్ట్‌లో ఆరు వికెట్లు తీస్తే భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఐదో ఫాస్ట్ బౌలర్‌గా నిలువనున్నాడు. ఇప్పటి వరకు కపిల్ దేవ్, ఇషాంత్ శర్మ, జవగల్ శ్రీనాథ్, మహమ్మద్ షమీ మాత్రమే ఈ ఘనతను సాధించారు. స్పిన్నర్లతో కలిసి మొత్తం 11 మంది టీమిండియా బౌలర్లు 200 వికెట్ల క్లబ్లో చేరారు.
మరో వైపు బ్రిస్బేన్ సెంచరీ హీరో స్టీవ్ స్మిత్ సైతం టెస్టులు పదివేల పరుగులకు చేరువయ్యాడు. ప్రస్తుతం 191 పరుగుల దూరంలో ఉండగా.. నాలుగో టెస్ట్‌లో రాణిస్తే పదివేల పరుగులు చేసిన నాలుగో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటి వరకు అలన్ బోర్డర్, స్టీవా, రికీ పాంటింగ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. స్మిత్ తన కెరీర్లో ఆరుసార్లు టెస్టుల్లో 191.. అంతకంటే ఎక్కువగానే పరుగులు చేశాడు. స్మిత్ 2014లో ఎంసీజీలో జరిగిన టీమిండియాతో జరిగిన టెస్టులో 192 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలకపాత్ర పోషించాడు.