Rohit Sharma | భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అడిలైడ్ ఓవర్ వేదికగా జరుగుతున్న టెస్ట్‌లో మరోసారి ఫ్లాప్ షోను కొనసాగించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఆరు పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది. శనివారం ఆట ముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. పింక్ బాల్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాదే పై చేయిగా కనిపిస్తున్నది. రోహిత్ శర్మకు ఇటీవల తనయుడు జన్మించడంతో పెర్త్ టెస్ట్‌కు దూరమైంది. రెండో టెస్ట్‌కు ముందు టీమిండియాతో చేరాడు. అయితే, రెండో టెస్ట్‌లో రోహిత్ ఆటతీరులో ఏమీ తేడా కనిపించలేదు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 23 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు చేయగా.. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ కేవలం ఆరు పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత్.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో తలపడింది. ఆ సిరీస్‌లలోనూ రోహిత్ బ్యాంటింగ్ పెద్దగా రాణించలేకపోయాడు. కివీస్‌పై ఆరు ఇన్నింగ్స్‌లో కేవలం 91 పరుగులు చేశాడు. ఇందులో ఒకసారి డకౌట్ అయ్యాడు. బంగ్లాదేశ్‌పై నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 42 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ రాణించలేకపోయాడు. ఆఖరి 12 ఇన్నింగ్‌లో ఎనిమిది సార్లు రెండంకెల స్కోర్ చేయలేకపోయాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఆరో నంబర్లో ఉన్న రోహిత్ బ్యాటింగ్ రికార్డును పరిశీలిస్తే.. 16 టెస్టు మ్యాచ్‌ల్లో 54.57 సగటుతో 1,037 పరుగులు చేశాడు.
ఇందులో మూడు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో హిట్‌మ్యాన్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఆ సమయంలో నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 37..ఒకటి..63..5 పరుగులు మాత్రమే చేశాడు. ఈ రెండు మ్యాచ్‌లు మెల్బోర్న్, అడిలైడ్‌లో జరిగాయి. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 337 పరుగులకు ఆలౌట్ చేసినప్పటికీ కంగారూ జట్టు 157 పరుగుల ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నది. స్కాట్ బోలాండ్, పాట్ కమిన్స్‌తో పాటు ఫాస్ట్‌బౌలర్లు టీమిండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. బౌన్సర్లు, ఫుల్లెన్త్ డెలివరీలతో హడలెత్తించారు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 128 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా కంటే 29 పరుగులు వెనుకబడి ఉన్నది. ఆట ముగిసే సరికి రిషబ్ పంత్ 28, నితీశ్ రెడ్డి 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్‌కు ఒక వికెట్ దక్కింది.