కోల్‌కతా : స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను యంగ్ ఇండియా ఘన విజయంతో ఆరంభించింది. ఈడెన్ గార్డెన్ వేదికగా బుధవారం ఆ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో బోణీ కొట్టింది. బ్యాటింగ్ ప్యారడైజ్‌గా పిలిచే ఈడెన్ గార్డెన్లో విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79, 5 ఫోర్లు, 8 సిక్సర్లు) ఇంగ్లీష్ బౌలర్లపై పిడుగులా విరుచుకుపడటంతో టీమ్ఇండియా భారీ విజయం సాధించింది. తొలుత భారత బౌలర్లు కట్టడి చేయడంతో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత ఓవర్లలో 132 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో సారథి జోస్ బట్లర్ (44 బంతుల్లో 68, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు. అనంతరం లక్ష్యాన్ని భారత్.. 12.5 ఓవర్లలోనే ఊదేసింది. అభిషేక్‌తో పాటు సంజూ శాంసన్ (20 బంతుల్లో 26, 4 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (19 నాటౌట్) రాణించారు. వరుణ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్‌ను ఆరంభ ఓవర్లలో అర్ష్‌దీప్ దెబ్బతీస్తే మధ్య ఓవర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్.. ఇంగ్లీష్ బ్యాటర్ల పనిపట్టారు. అర్ష్‌దీప్ వేసిన తొలి ఓవర్లో మూడో బంతికే సాల్ట్.. శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. తన రెండో ఓవర్లో అర్ష్‌దీప్.. బెన్ డకెట్ (4)నూ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఓపెనర్లను కోల్పోయింది. ఆ తర్వాత సారథి జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (17) మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే యత్నం చేశారు. అయితే చక్రవర్తి.. ఒకే ఓవర్లో బ్రూక్, ప్రమాదకర లివింగ్‌స్టోన్‌ను ఔట్ చేయడంతో పర్యాటక జట్టు కోలుకోలేకపోయింది. బెథెల్ (7), ఓవర్టన్ (2) సైతం క్రీజులో నిలవలేకపోయారు. 34 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసిన బట్లర్‌ను చక్రవర్తి 17వ ఓవర్లో పెవిలియన్‌కు పంపడంతో ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
స్వల్ప ఛేదనను భారత్ దూకుడుగా ఆరంభించింది. జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్లో ఒక్క పరుగే రాబట్టిన ఓపెనర్ శాంసన్.. అట్కిన్సన్ రెండో ఓవర్లో 4, 4, 6, 4, 4 తో 22 పరుగులు పిండుకున్నాడు. ఆర్చర్ మూడో ఓవర్లో అభిషేక్ 4,6 బాదాడు. అతడే వేసిన 5వ ఓవర్లో మూడు బంతుల వ్యవధిలోనే శాంసన్, సూర్యకుమార్ నిష్క్రమించారు. ఈ ఇద్దరూ నిష్క్రమించినా అభిషేక్.. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రషీద్ 8వ ఓవర్లో 4తో పాటు డీప్‌మిడ్ వికెట్, లాంగాన్ మీదుగా రెండు భారీ సిక్సర్లు బాదాడు. 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసిన అతడు ఆ తర్వాత మరింత జోరు పెంచాడు. అట్కిన్సన్ 11వ ఓవర్లో 6, 4 సాధించిన అతడు.. ఆ తర్వాత మరో రెండు భారీ సిక్సర్లు బాది భారత్‌కు విజయానికి చేరువ చేశాడు. ఆఖర్లో అతడు ఔట్ అయినా తిలక్ వర్మ లాంఛనాన్ని పూర్తిచేశాడు.
టీ20లలో అర్ష్‌దీప్ భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. మ్యాచ్‌లో బెన్ డకెట్ వికెట్ అతడి టీ20 కెరీర్లో 97వది. ఈ క్రమంలో అతడు యుజ్వేంద్ర చాహల్ (96) రికార్డును అధిగమించాడు. చాహల్ 80 ఇన్నింగ్స్‌లలో 96 వికెట్లు సాధిస్తే.. అర్ష్‌దీప్ 61 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత అందుకున్నాడు.
సంక్షిప్త స్కోర్లు:
ఇంగ్లండ్: 20 ఓవర్లలో 132 ఆలౌట్ (బట్లర్ 68, బ్రూక్ 17, వరుణ్ 3/23, అర్ష్‌దీప్ 2/17)
భారత్: 12.5 ఓవర్లలో 133/3 (అభిషేక్ 79, శాంసన్ 26, ఆర్చర్ 2/21, రషీద్ 1/27)